సంపూర్ణ మద్య నిషేధం...సాధ్యమేనా ?

First Published Nov 19, 2017, 9:13 AM IST
Highlights
  • ‘సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడిగేందుకు మళ్ళీ మీ వద్దకు వస్తా’..ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా హామీ.

‘సంపూర్ణ మధ్య నిషేధం అమలు చేసిన తర్వాతే 2024లో ఓట్లు అడిగేందుకు మళ్ళీ మీ వద్దకు వస్తా’..ఇది వైఎస్ జగన్మోహన్ రెడ్డి తాజా హామీ. ప్రజా సంకల్పయాత్రలో భాగంగా 12వ రోజు కర్నూలు జిల్లాలోని దొర్నిపాడు వద్ద మహిళలను ఉద్దేశించి మాట్లాడారు. ‘మద్యం సేవించటం వల్ల పేదల కుటుంబాలు చిన్నాభిన్నం అవుతున్నాయి. మరో ఏడాదిలో మన ప్రభుత్వం వస్తుంది. సంపూర్ణ మద్య నిషేధం అమలు చేస్తా’ అని ప్రకటించారు. పాదయాత్రలో మహిళలతో మాట్లాడేందుకే ఎక్కువ సమయం కేటాయించారు. భీమునిపాడు సమీపంలో పొలం పనులు చేసుకుంటున్న మహిళలతో జగన్ మాట్లాడుతూ ‘మద్య నిషేధం చేయాలా’ అంటూ ప్రశ్నించారు. దానికి బదులుగా అవునంటూ అందరూ తమ చేతులను పైకెత్తారు.

పాదయాత్ర సందర్భంగా జగన్ ఇస్తున్న హామీలపై జనాల్లో చర్చ జరుగుతోంది. వాటి అమలుపై మిశ్రమ స్పందన కనబడుతోంది. అయితే, మద్య నిషేధం హామీపైనే ప్రజల్లో నమ్మకం కనబడటం లేదు. ఎందుకంటే, గతంలో ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నపుడు, అంటే 1994లో మద్య నిషేధాన్ని విధించారు. అయితే, అమల్లోకి వచ్చే సరికి విఫలమయ్యారు. ఎందుకంటే, ఏపికి సరిహద్దు రాష్ట్రాలుగా ఉన్న కర్నాటక, తమిళనాడు, పాండిచ్చేరి, తెలంగాణాలో మద్యంపై నిషేధం లేనపుడు ఏపిలో అమలు సాధ్యం కాదు. దేశంలోని ఏ రాష్ట్రంలో కూడా నిషేధం సక్సెస్ అయినా దాఖలాలు కూడా లేవు. ఏవో అక్కడక్కడ గ్రమస్ధాయిలో అయితే అవ్వచ్చేమో.

గతంలో కూడా ఈ విషయం రుజువైంది. నిషేధం ముసుగులో అక్రమ రవాణా పెరిగిపోతుంది. దాన్ని ఎవరూ అరికట్టలేరు. నిషేధానికి ముందు బాటిల్ బ్రాందిని రూ. 100 కి కొనేవారు నిషేధం సమమంలో అదే బాటిల్ ను రూ. 400 కొనాల్సి వస్తుంది. ఇటువంటి విషయాలు జగన్ కు తెలియవనుకునేందుకు లేదు. మద్య నిషేధమంటేనే అధికార పార్టీలోని కొందరు నేతలకు, వారితో కుమ్మకైన అధికారులకు ప్రతీ రోజూ పండగే.

నిషేధం ఉన్నా తాగేది తాగేదే. కాకపోతే దొంగచాటుగా తాగుతారు లేదా పొరుగు రాష్ట్రాలకు వెళ్ళి తాగుతారు. దాని వల్ల ప్రభుత్వానికి ఆదాయం పడిపోవటం తప్ప ఏమీ ఉపయోగం ఉండదు. అదే, సంపూర్ణ నిషేధం బదులు మద్యం ధరలను విపరీతంగా అంటే సామాన్య, మధ్య తరగతి జనాలకు అందుబాటులో లేనంతగా పెంచేస్తే డబ్బులున్న వాళ్ళెవరో కొనుక్కుంటారు. మిగిలిన వాళ్ళు అవకాశం ఉన్నంతలో దూరంగా ఉంటారు. హామీలను ఇచ్చేటపుడు ఒకటికి రెండు సార్లు ఆచరణ సాధ్యాసాధ్యాలపై జగన్ నలుగురితో చర్చిస్తే బాగుంటుంది.

click me!