
నిజంగా నంద్యాల నియోజకవర్గ ప్రజలు వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డికి ధన్యవాదాలు చెప్పుకోవాల్సిందే. ఎందుకంటే, జగన్ వల్లే నంద్యాలలో అభివృద్ధి జరుగుతోంది. అధికారంలో చంద్రబాబునాయుడుంటే అభివృధి ప్రతిపక్ష నేత వల్ల ఎలా సాధ్యమైందా అని అనుమానిస్తున్నారా? పోయిన ఎన్నికల్లో ఇక్కడ వైసీపీ నుండి భూమా నాగిరెడ్డి గెలిచారు. అయితే అధికారంలోకి తెలుగుదేశంపార్టీ వచ్చింది. మిగిలిన వైసీపీ నియోజకవర్గాల్లో లాగే ఇక్కడ కూడా అభివృద్ధి పనులు పెద్దగా జరగలేదు.
తెరవెనుక ఏం జరిగిందో ఏమో గానీ వైసీపీ ఎంఎల్ఏ భూమా నాగిరెడ్డి టిడిపిలోకి ఫిరాయించారు. అభివృద్ధి కోసమే ఫిరాయించారని కొందరు, మంత్రిపదవి ఇస్తానన్న చంద్రబాబు హామీ వల్లే టిడిపిలో చేరారని మరి కొందరు వాదించారు. సరే, ఈ వివాదం కొనసాగుతుండగానే భూమా హటాత్తుగా మరణించారు. మరణం తర్వాత జరిగిన రచ్చ, నంద్యాలను ఏకగ్రీవంగా అందుకోవాలని టిడిపి చేసిన ప్రయత్నాలు, వైసీపీ అంగీకరించని విషయం అందరికీ తెలిసిందే. ఈ నేపధ్యంలోనే నంద్యాల నియోజకవర్గంలో పోటీ చేయబోయే అభ్యర్ధులను ఇరుపార్టీలు ప్రకటించేసాయి.
పోటీ తప్పదని తేలిపోయిన తర్వాత చంద్రబాబుకు నంద్యాలపై ప్రేమ పొంగుకొచ్చింది. ఒక్కసారిగా అభివృద్ధిపనులకు మోక్షం లభించింది. వందల కోట్లరూపాయల వ్యయంతో నంద్యాలతో పాటు గ్రామీణ ప్రాంతాల్లో కూడా రోడ్లు మంజూరవుతున్నాయి. కాల్వలు తవ్వుతున్నారు. మొన్ననే కాపు సంక్షేమ భవన్ నిర్మాణానికి రూ. 3 కోట్లు, ఆసుపత్రికి రూ. 5 కోట్లు మంజూరయ్యాయి.
సామాజికవర్గాల వారీగా అందుతున్న లబ్ది వేరే. ఆయా సామాజికవర్గాల్లో పట్టుంది అనుకున్న వారికీ ఏదో రూపంలో లబ్ది అందుతోంది. ఇంత తక్కువ కాలంలో ఇంత భారీ ఎత్తున నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాలు గతంలో ఎవరి హయాంలో కూడా జరగలేదన్నది వాస్తవం. ఇదంతా ఎవరి వల్ల జరుగుతోంది?
కేవలం జగన్ వల్లే సాధ్యమైంది. ఎలాగంటే, నంద్యాలలో పోటీ కాకుండా ఏకగ్రవం జరిగివుంటే చంద్రబాబు నియోజకవర్గంవైపు కన్నెత్తి కూడా చూసేవారు కారన్నది వాస్తవం. సీటు వైసీపీకొచ్చినా టిడిపికొచ్చిన రిజల్ట్ అయితే అదే. కావాలంటే ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాలను కానీ లేకపోతే టిడిపి నియోజకవర్గాలనైనా చూడండి.
ఈ స్ధాయి హడావుడి ఏ నియోజకవర్గంలోనైనా జరుగుతుతోందా? నంద్యాలలో గెలుపును చంద్రబాబు ప్రిస్టేజ్ గా తీసుకున్నారు కాబట్టే నంద్యాలలో ఇపుడింత అభివృద్ధి, రచ్చా రెండూ జరుగుతోంది. లేకపోతే నంద్యాలను పట్టించుకునే వారెవరు? ఇపుడు చెప్పండి నంద్యాలలో జరుగుతున్న అభివృద్ధికి నిజంగా కారణమెవరో?