పీలాను ఎరగా వేస్తున్నారా ?

First Published Jul 15, 2017, 10:10 AM IST
Highlights
  • బురద తమకు మాత్రమే అంటుకుంటే ఎలా?
  • ప్రతిపక్షాలకు కూడా పూస్తే రేపటి ఎన్నికల్లో టిడిపికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు.
  • ఒకవేళ వైసీపీ ప్రస్తావించినా ఎదురుదాడి చేయటానికి అవకాశం ఉంటుంది.
  • అందుకే అనకాపల్లి ఎంఎల్ఏ పీలాగోవింద్ ను ఎరగా వేస్తున్నట్లే కనబడుతోంది.

చేపలు పట్టాలంటే ఎవరైనా ఏం చేస్తారు? గాలంతో పాటు ఎరవేస్తారు. ప్రభుత్వ వైఖరి కూడా అదే విధంగా ఉందన్న అనుమానాలు మొదలయ్యాయి. విశాఖపట్నం జిల్లాలో బయటపడిన భూకుంభకోణం రాష్ట్రంలో సంచలనం సృష్టించటమే కాకుండా టిడిపిని ఇరకాటంలోకి నెట్టేసింది. ప్రభుత్వానికి చెందిన వందలాది ఎకరాలను టిడిపి నేతలు సొంతం చేసుకున్నారన్నది ఆరోపణ.

 ఏం చేయాలో అర్ధంకాని పరిస్ధితిల్లో బహిరంగ విచారణకు చంద్రబాబునాయుడు నిర్ణయించారు. వెంటనే బహిరంగ విచారణకు తూచ్ అనేసారు. తర్వాత స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (టీం)ను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. విచారణ  మొదలుపెట్టిన సిట్ టిడిపి ఎంఎల్ఏ పీలా గోవింద్ పై తర్వలో కేసు నమోదు చేస్తుందన్న ప్రచారం మొదలైంది. అంటే పీలానే టిడిపి ఎరగా వేస్తోందా?

కుంభకోణంలో మంత్రి గంటా శ్రీనివాసరావు పాత్రపై సహచర మంత్రి చింతకాయల అయ్యన్నపాత్రుడు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. గంటాతో పాటు టిడిపికి చెందిన ఐదుగురు ఎంఎల్ఏ, ఎంఎల్సీలున్నట్లు వైసీపీ ఆరోపణలు మొదలుపెట్టింది. మిగిలిన ప్రతిపక్షాలను కూడా కలుపుకుని ఆందోళనలు ఉధృతం చేయటంతో కుంభకోణం వేడి టిడిపికి బాగా తగిలింది. దాంతో ఎవరో ఒకరిని బలి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అధికార, ప్రతిపక్షాలన్నది సాంకేతికమే కానీ కుంభకోణాల్లోనూ, ఆర్ధిక వ్యవహారాల్లోనూ చాలామంది నేతలు భాగస్వాములే అన్నది బహిరంగ  రహస్యం.

ఇటు గంటాపైన కానీ అటు చింతకాయలపైన కానీ చంద్రబాబు చర్యలు తీసుకునే స్ధితిలో లేరు. కాబట్టి ఎవరో ఒకరిని బలి చేయక తప్పదు. అయితే, తమవారిని బలి పెట్టేటపుడు ప్రతిపక్ష నేతలను మాత్రం ఎందుకు వదిలిపెట్టాలన్న ఆలోచన టిడిపిలో మొదలైంది. అందుకనే ముందు పీలాను ఎరగా వేసి తర్వాత ప్రతిపక్షాల్లోని నేతలను కూడా కేసుల్లోకి లాగాలన్నది టిడిపి వ్యూహంగా కనబడుతోంది. అందుకు తగ్గట్లే వైసీపీలోని ఓ కీలక నేత పీలా వ్యాపార భాగస్వామిగా ప్రచారం మొదలైంది. ఆ నేత వల్లే పీలాకు ప్రభుత్వ భూములు దక్కాయట.

ఎన్నికలు దగ్గర పడుతున్నాయి కదా ? బురద తమకు మాత్రమే అంటుకుంటే ఎలా? ప్రతిపక్షాలకు కూడా పూస్తే రేపటి ఎన్నికల్లో టిడిపికి ఎటువంటి ఇబ్బందీ ఉండదు. ఒకవేళ వైసీపీ ప్రస్తావించినా ఎదురుదాడి చేయటానికి అవకాశం ఉంటుంది. అందుకే అనకాపల్లి ఎంఎల్ఏ పీలాగోవింద్ ను ఎరగా వేస్తున్నట్లే కనబడుతోంది. భూ కుంభకోణంలో పీలాతో పాటు ప్రతిపక్ష నేతలనపైనా కేసులు పెడితేనే టిడిపి సేఫ్. లేకపోతే, ప్రతిపక్షాలు లేవనెత్తే భూకుంభకోణం ఆరోపణలతో ఉత్తరాంధ్రలో టిడిపి ఉక్కిరిబిక్కిరవ్వటం ఖాయం.

 

 

click me!