పాడేరులో ప్రమాదం: 100 అడుగుల లోతు లోయలో పడ్డ బస్సు, ఇద్దరు మృతి

By narsimha lodeFirst Published Aug 20, 2023, 3:58 PM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ లోని  పాడేరు  వద్ద 100 అడుగుల లోతులో ఉన్న లోయలో  ఆర్టీసీ బస్సు  పడింది. ఈ ప్రమాదం జరిగిన సమయంలో బస్సులో  40 మంది ఉన్నారు.

విశాఖపట్టణం:అల్లూరి సీతారామరాజు  జిల్లాలోని పాడేరు వ్యూ పాయింట్ వద్ద  ఏపీఎస్ ఆర్టీసీ బస్సు లోయలో పడింది. ఈ సమయంలో  బస్సులో  40 మంది ప్రయాణీకులున్నారు. చెట్టు కొమ్మను తప్పించే క్రమంలో అదుపు తప్పిన బస్సు 100 అడుగుల లోతులో ఉన్న లోయలో పడింది. చోడవరం నుండి  పాడేరు వెళ్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు  చేసుకుంది.

ఇదే రోడ్డులో వెళ్తున్న  వాహన దారులు  బస్సు ప్రమాదాన్ని గుర్తించి  బస్సులోని వారిని రక్షించారు.  విషయం తెలిసిన వెంటనే  పోలీసులు, అధికారులు సంఘటన స్థలానికి చేరుకున్నారు.  సంఘటన స్థలంలో  సహాయక చర్యలు చేపట్టారు.

ఈ ఘటనలో  10 మంది తీవ్రంగా గాయపడ్డారు.  గాయపడిన వారిని అంబులెన్స్ లో  స్థానికంగా  ఉన్న ఆసుపత్రికి తరలించారు. ఈ బస్సు ప్రమాదంలో తీవ్రంగా గాయాలు కాని వారిని  మరో బస్సులో  గమ్యస్థానాలకు చేర్చేందుకు ఆర్టీసీ అధికారులు  ప్రయత్నిస్తున్నారు. ఆర్టీసీ బస్సు లోయలో పడే సమయంలో  లోయలో ఉన్న చెట్లు  ప్రమాద తీవ్రతను తగ్గించినట్టుగా అధికారులు అభిప్రాయపడుతున్నారు.

ప్రమాదం జరిగిన స్థలంలో  సెల్ ఫోన్ సిగ్నల్స్ కూడ లేవు. దీంతో ప్రమాదం జరిగిన విషయం  బయట ప్రపంచానికి  తెలపడానికి సమయం పట్టిందని బాధితులు చెబుతున్నారు.  సంఘటన స్థలానికి  రెండు కిలోమీటర్ల దూరం దాటిన తర్వాత  సెల్ ఫోన్ సిగ్నల్స్  రావడంతో  బాధితులు  ఈ సమాచారాన్ని అధికారులకు  చేరవేశారు. 


 

tags
click me!