
వచ్చే ఏపీ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో సంచలన వ్యాఖ్యలు చేశారు కాంగ్రెస్ నేత తులసి రెడ్డి. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. వచ్చే ఎన్నికల్లో జగన్‌కు పరాభవం తప్పదన్నారు. సొంత నియోజకవర్గంలోనే జగన్ ఓటమి పాలవ్వడం పక్కా అని తులసి రెడ్డి జోస్యం చెప్పారు. ఇటీవల జరిగన మండలి, వార్డు ఎన్నికలే ఇందుకు నిదర్శనమన్నారు. వైసీపీ, బీజేపీలను ఓడిస్తేనే రాష్ట్రం, దేశం సుభిక్షంగా వుంటాయని ఆయన అభిప్రాయపడ్డారు.
2019 ఎన్నికల అఫిడవిట్ ప్రకారం జగన్ సీఎం కాకముందే దేశంలోని ముఖ్యమంత్రులందరికంటే ధనవంతుడని తులసి రెడ్డి చెప్పారు. తనకు రూ.370 కోట్ల ఆస్తులు వున్నట్లు జగన్ అఫిడవిట్‌లో పేర్కొన్నారని.. 9 మంది వైసీపీ రాజ్యసభ సభ్యులు కూడా కోటీశ్వరులేనని, వారిలో నలుగురు బిలియనీర్లు కూడా వున్నారని తులసి రెడ్డి వ్యాఖ్యానించారు. అయినప్పటికీ తమది పేదల పార్టీ అని జగన్ చెప్పడం విడ్డూరంగా వుందని.. ఆంధ్రప్రదేశ్‌లో సహజ వనరులు దోపిడీకి గురవుతున్నాయని తులసిరెడ్డి ఆరోపించారు. చెల్లెళ్లు షర్మిల, సునీతకు న్యాయం చేయలేని జగన్ మహిళా సాధికారతకు కృషి చేస్తారా అని ఆయన ప్రశ్నించారు.