బిటెక్ రవిని చంపేదుకు కుట్రలు..: బుద్దా వెంకన్న సంచలనం

By Arun Kumar PFirst Published Nov 15, 2023, 1:50 PM IST
Highlights

వచ్చే అసెంబ్లీ ఎన్నికల నాటికి పులివెందుల నియోజకవర్గంలో తనను ఓడించే స్థాయికి ఎక్కడ టిడిపి బలపడుతుందోనని భయపడే జగన్ కు బిటెక్ రవిని అరెస్ట్ చేయించాడని బుద్దా వెంకన్న తెలిపారు. 

అమరావతి : ముఖమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై పోటీచేయడమే కాదు రాబోయే ఎన్నికల్లోనూ మళ్లీ పోటీకి సిద్దమవుతున్నాడనే మాజీ ఎమ్మెల్యే బిటెక్ రవిపై కక్షగట్టారని బుద్దా వెంకన్న అన్నారు. ఈసారి ఎక్కడ పులివెందులలో ఓడిపోతానో అనే భయం జగన్ కు పట్టుకుందని... అందువల్లే బిటెక్ రవిపై కుట్రలు చేస్తున్నాడని ఆరోపించారు. అరెస్ట్ కాదు రవిని చంపేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయంటూ బుద్దా వెంకన్న సంచలన వ్యాఖ్యలు చేసారు. 

ప్రస్తుతం పులివెందుల ఇంచార్జ్ మారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి అలియాస్ బిటెక్ రవి టిడిపిని బలోపేతం చేసుకుంటున్నారని వెంకన్న అన్నారు. ఇది ఇలాగే కొనసాగితే ఎన్నికల నాటికి తనను ఓడించే స్థాయికి టిడిపి బలపడుతుందని జగన్ కు అర్థమయ్యింది... అందువల్లే రవిని అరెస్ట్ చేయించారని అన్నారు. ఇలా అరెస్టులకు భయపడే రకంకాదు రవి... అందువల్లే ఆతడిని చంపేందుకు సిద్దమయ్యారని వెంకన్న అన్నారు. 

ఎప్పుడో పులివెందులకు వచ్చిన నారా లోకేష్ ను స్వాగతం పలికే క్రమంలో తోపులాట జరిగితే ఆ కేసులో ఇప్పుడు అరెస్ట్ చేయడం ఏమిటని వెంకన్న ప్రశ్నించారు. పోలీసులు అధికార వైసిపికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని... వారిని అడ్డుపెట్టుకుని  జగన్ రాజకీయ కక్షసాధింపుకు పాల్పడుతున్నాడని అన్నారు. ఇప్పటికే అనేకమంది టిడిపి  నాయకులపై పోలీసులతో కేసులు పెట్టించడం... అరెస్టులు చేయించడం చేసారన్నారు. ఇప్పుడు బిటెక్ రవిని కూడా అలాగే తప్పుడుకేసులు పెట్టి అరెస్ట్ చేయించారని బుద్దా వెంకన్న ఆరోపించారు. 

Read More  పిరికిపంద జగన్... బిటెక్ రవిని చూసి భయపడుతున్నావులే..!: నారా లోకేష్ (అరెస్ట్ వీడియో)

బిసి నాయకుడినైన తనపై జగన్ సర్కార్ 44 పోలీస్ కేసులు పెట్టించింది... అలాగే అచ్చెన్నాయుడు, అయ్యన్నపాత్రుడు, కొల్లు రవీంద్ర, యనమల రామకృష్ణుడు, కాల్వ శ్రీనివాసులు వంటి ప్రతిపక్ష బీసీ నాయకులపైనా కేసులు పెట్టించి వేధిస్తున్నారని వెంకన్న తెలిపారు. కానీ కొడాలి నాని, వలభనేని వంశీ వంటివారు ఏం చేసినా కేసులుండవని అన్నారు. ఇన్నాళ్ళు బీసీలకు మోసం చేసిన వైసీపీ సర్కార్ ఇప్పుడు ఎన్నికలు వస్తున్నాయనే బీసీల బస్ యాత్ర పేరిట నాటకాలు ఆడుతోందని మండిపడ్డారు. 

రాష్ట్రంలో శాంతిభద్రతలు కాపాడాల్సిన పోలీసులు ఈ అరాచక ప్రభుత్వానికి సహాయనిరాకరణ చేయాలని వెంకన్న సూచించారు. పోలీసులంతా ఒక్క వారంరోజులు సెలవు పెట్టాలి... అప్పుడు టీడీపీ, వైసీపీ దమ్మేంటో తేల్చుకుంటాం అని సవాల్ విసిరారు. పోలీసులు ప్రభుత్వంపై రివర్స్ కావాలి... లేదంటే వైసిపి నాయకుల పాపాలు వారికి తగులుతాయని హెచ్చరించారు. ప్రజలను ఇబ్బంది పెడుతున్న సీఎం వైఎస్ జగన్ ను పోలీసులు తరిమికొట్టాలని టిడిపి నేత బుద్దా వెంకన్న సూచించారు. 

click me!