దాంట్లో రూ.4500కోట్ల అవినీతి... ఆ మంత్రులు, ఎమ్మెల్యేలపై సిబిఐ విచారణ: బుద్దా వెంకన్న డిమాండ్

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 3:17 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన జగనన్న కాలనీల నిర్మాణంలో భారీ అవినీతి జరిగిందని... దీనిపై సిబిఐ విచారణకు ఆదేశించాలని సీఎం జగన్ ను టిడిపి నాయకులు బుద్దా వెంకన్న కోరారు.

విజయవాడ: రాష్ట్రంలో అధికారపార్టీ అవినీతి పతాకస్థాయికి చేరిందని... రూ.6500కోట్లు వెచ్చించి మరీ ఇళ్లు కట్టుకోడానికి పనికిరాని స్థలాలను పేదలకు అంటగట్టారని టీడీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బుద్దా వెంకన్న ఆరోపించారు. జగనన్నకాలనీల పేరుతో ఈ ప్రభుత్వం జగనన్న చెరువులను ప్రజలకు అంటగడుతోందని బుద్దా ఎద్దేవా చేశారు. 

''వరదలు వచ్చినప్పుడు కృష్ణా, గోదావరి పరీవాహక ప్రాంతాలు ఎలా ఉంటాయో ప్రభుత్వం ఇళ్లనిర్మాణం చేయాలనుకుంటున్న భూములు అలాఉన్నాయి. మొసళ్లు, ఇతర జలచరాలు నివాసముండటానికి యోగ్యమైన గొప్పభూముల్లో జగనన్న కాలనీల నిర్మాణం చేపడతామని ప్రభుత్వం చెబుతోంది. పేదలకు ఇళ్లు నిర్మించి ఇస్తోంది అక్కడ వారు చేపలు, రొయ్యలు పెంచుకోడానికా...లేక నివాసముండటానికా?'' అని వెంకన్న నిలదీశారు. 

''గతంలో చంద్రబాబు నాయుడి హాయాంలో దాదాపు 90శాతం వరకు పూర్తయిన టిడ్కో ఇళ్లను మిగిలిన10శాతం పూర్తిచేసి పేదలకు అప్పగిస్తే వారి ఇంటి బాధలు ఎప్పుడో తీరేవి. కానీ ఈ ప్రభుత్వానికి ఆ పని చేయడానికి మనసొప్పడంలేదు. పేదలంతా మంచి ఇళ్లలో ఉండటం, సుఖంగా జీవించడం జగన్ అండ్ కోకు ఇష్టంలేదు'' అని మండిపడ్డారు.

''ఇళ్లస్థలాల పేరుతో నివాసయోగ్యంకాని భూముల కొనుగోలు, చదును పేరుతో ప్రభుత్వం ఖర్చుచేసిన రూ.6,500కోట్లలో రూ.4,500కోట్లు వైసీపీ నేతలు, కార్యకర్తల జేబుల్లోకే వెళ్లాయి. జగన్ ప్రభుత్వానికి నిజంగా పేదలపై ప్రేమాభిమానాలుంటే వారిని చెరువుల్లో కాపురం చేయమని చెప్పదు. కొద్దిపాటి వర్షాలకే నీటమునిగే ప్రాంతాల్లో ఏరికోరి కాలనీలు కట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి,  ముఖ్యమంత్రికి ఎలా వచ్చిందో, ఎందుకొచ్చిందో తెలియడంలేదు'' అని విమర్శించారు. 

read more  సుజనా సహకరించలేదు.. హైకోర్టుతో సీబీఐ

''చిన్న పాటి వర్షాలకే నీటమునిగే ఇంటిస్థలాలపై రాష్ట్రవ్యాప్తంగా తగు నివేదిక తెప్పించుకొని వాస్తవంలో ఏం జరుగుతోందో  ముఖ్యమంత్రి ఆలోచన చేయాలి. పేదలకు నిజంగా ఇళ్లు కట్టివ్వడానికి ప్రభుత్వం స్థలాలను ఎంపికచేసినట్టుగా లేదని... కేవలం అధికారపార్టీ వారి జేబులు నింపడానికే ఈ తతంగం నిర్వహించినట్టుగా తమకు అనిపిస్తోంది. అధికార పార్టీ ఎమ్మెల్యేలు, మంత్రులు, ఇతర నేతలు మాత్రం సకల సౌకర్యాలున్న విలాసవంతమైన భవనాల్లో ఉంటూ పేదలకు మాత్రం ముంపునకు గురయ్యే ప్రాంతాలను కేటాయించడం ముమ్మాటికీ దుర్మార్గమే'' అంటూ మండిపడ్డారు. 

''ముఖ్యమంత్రి తక్షణమే ఇళ్లస్థలాలకు సంబంధించిన భూముల కొనుగోలు వ్యవహారం, స్థలాల కేటాయింపు తదతర అంశాలపై సీబీఐ విచారణ జరిపించాలి. అప్పుడే అధికారపార్టీ నేతల అడ్డగోలు అవినీతి బట్టబయలవుతుంది. ఉత్తుత్తి సీఐడీ విచారణలు కాకుండా జగనన్న కాలనీల నిర్మాణానికి కేటాయించిన స్థలాల ఎంపికపై జగన్మోహన్ రెడ్డి వెంటనే సీబీఐ విచారణ జరిపించాలి'' అని బుద్దా డిమాండ్ చేశారు. 

''చంద్రబాబు నాయుడి హాయాంలో ప్రారంభించి 90శాతం పూర్తైన టిడ్కో ఇళ్లను పేదలకు కేటాయిస్తే జగన్మోహన్ రెడ్డికే పేరొస్తుంది. ఎన్నికలకు ముందు టిడ్కో ఇళ్లను లబ్ధిదారులు సొమ్ము చెల్లించాల్సిన పని లేకుండా ఉచితంగానే ఇళ్లు కేటాయిస్తానని చెప్పిన జగన్మో హన్ రెడ్డి... అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తడం లేదు. జగనన్న కాలనీల నిర్మాణం పూర్తికాకముందే అధికారపార్టీ నేతలు రాష్ట్రవ్యాప్తంగా రూ.4500కోట్ల వరకు దోపిడీ చేశారు. ఆ బాగోతం ప్రజలకు తెలియాలంటే ముఖ్యమంత్రి వెంటనే ఈ వ్యవహారంపై సీబీఐ విచారణకు ఆదేశించాలి'' అన్నారు.

''ఏమీ జరగని వాటిపై సీఐడీ విచారణలు జరిపిస్తూ కాలయాపన చేయడాన్ని ప్రభుత్వం మానేసి వాస్తవంగా జరపాల్సిన వాటిపై విచారణ జరిపితే మంచిది.  వైసీపీ ప్రభుత్వం ఇళ్లస్థలాల పేరుతో పేదలకు ఇచ్చిన జాగాల బాగోతాన్ని ప్రజల్లోనే ఎండగడతాం'' అని బుద్దా హెచ్చరించారు. 

click me!