జీవో నెంబర్ 2 సస్పెండ్... హైకోర్టులో జగన్ సర్కార్ కు మరో ఎదురుదెబ్బ

By Arun Kumar PFirst Published Jul 12, 2021, 2:53 PM IST
Highlights

ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. జగన్ సర్కార్ జారీచేసిన జీవో నెండర్ 2ను రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం సస్పెండ్ చేసింది. 

అమరావతి: ఏపీ ప్రభుత్వానికి హైకోర్టులో మరో ఎదురుదెబ్బ తగిలింది. పంచాయితీ సర్పంచులు, సెక్రటరీల అధికారాలను వీఆర్వోలకు అప్పగిస్తూ జగన్ సర్కార్ జారీ చేసిన జీవో నెంబర్ 2ను సస్పెండ్ చేసింది హైకోర్టు. ఈ జీవో ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించాడు. ఆయన దాఖలుచేసిన పిటిషన్ పై సోమవారం విచారణ జరిగిన న్యాయస్థానం జీవోను సస్పెండ్ చేసింది. 

పంచాయతీరాజ్ వ్యవస్థను నిర్వీర్యంచేసేలా ప్రజలచేత ఎన్నుకోబడిన సర్పంచ్ అధికారాలను రెవెన్యూ పరిధిలోకి బదిలీ చేస్తూ జీవో నెంబర్ 2 తీసుకువచ్చారని రాష్ట్రంలోని ప్రధాన రాజకీయపార్టీలన్ని ఆందోళన వ్యక్తం చేశాయి. ఈ వివాదాస్పద జీవోను వెంటనే ఉపసంహరించుకోవాలని నిరసనలు కూడా జరిగాయి. 

read more  దేవాదాయ అధికారులపై హైకోర్ట్ సీరియస్... కోర్టు ధిక్కరణ నోటీసులు జారీ

జగన్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గ్రామాల్లో సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసింది. ఈ సచివాలయాల ద్వారానే గ్రామాల్లో పాలన సాగుతోంది. అయితే ఇప్పటివరకు సచివాలయాల పర్యవేక్షణ బాధ్యత పంచాయితీరాజ్ పరిధిలో వుండగా ఇటీవల జీవో నెంబర్ 2 ద్వారా రెవెన్యూ శాఖకు బదలాయించారు. దీంతో వాలంటీర్లతో పాటు మిగతా సచివాలయ సిబ్బంది రెవెన్యూ వ్యవస్థలోకి బదలాయించడం ద్వారా సర్పంచ్ ల అధికారాలను కత్తిరించింది ప్రభుత్వం. 

ఇలా తమ అధికారాలను తగ్గిస్తూ జగన్ సర్కార్ తీసుకువచ్చిన జీవో నెంబర్ 2ను సవాల్ చేస్తూ గుంటూరు జిల్లా తురకపాలెం సర్పంచ్ కృష్ణమోహన్ హైకోర్టును ఆశ్రయించాడు. దీంతో ప్రభుత్వం జారీచేసిన జీవోను సస్పెండ్ చేస్తూ రాష్ట్రంలోని సర్పంచ్ లు అందరికీ ఊరట కల్పించింది హైకోర్టు. 

click me!