
బాపట్ల జిల్లాలో పోలీసుల దాష్టీకం ఒకటి వెలుగుచూసింది. జిల్లాలోని వేమూరు పోలీసు స్టేషన్ ఎస్సై అనిల్ ఓ బాలుడిని విచక్షణరహితంగా చితకబాదాడు. ఓ విషయంలో సెటిల్‌మెంట్ కోసం పిలిచి దారుణంగా ప్రవర్తించాడు. బాలుడి తలపై కత్తితో దాడి చేశాడు. దీంతో బాలుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. ఇద్దరు యువకుల మధ్య ఘర్షణకు సంబంధించిన పంచాయితీ పోలీసు స్టేషన్‌కు చేరింది. ఈ క్రమంలోనే సెటిల్‌మెంట్ కోసం పోలీస్ స్టేషన్‌కు రావాలని రఫీ కుటుంబ సభ్యులను సమాచారం అందింది. దీంతో రఫీతో పాటు కుటుంబ సభ్యులు వేమూరు పోలీసు స్టేషన్‌కు వచ్చారు.
అయితే అక్కడ ఎస్సై అనిల్, ఇద్దరు కానిస్టేబుల్స్ రఫీపై దాడి చేశారని అతడి కుటుంబ సభ్యులు ఆరోపించారు. రఫీని గదిలోకి తీసుకెళ్లిన ఎస్సై అనిల్, ఇద్దరు కానిస్టేబుల్స్ దారుణంగా చితకబాదారని చెప్పారు. జట్టును తొలగించేందుకు.. రఫీ తలపై రెండు సార్లు కత్తితో గట్టిగా కోయడంతో తీవ్ర రక్తస్రావం జరిగిందని తెలిపారు. విచారణకు పిలిచి దారుణంగా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇక, పోలీసుల దాడి చేయడంతో రఫీ భయంతో బయటకు పరుగులు తీశాడు. కొడుకు తల నుంచి రక్తం రావడం చూసి అతడి తల్లి స్టేషన్ వద్దే సృహతప్పి పడిపోయింది. రఫీ తల్లి తలకు గాయం కావడంతో ఆమెను ఆస్పత్రికి తరలించారు.