లాక్ డౌన్ ను పొడిగించిన కేంద్రం... కలెక్టర్లు, ఎస్పీలకు జగన్ ఇచ్చిన ఆదేశాలివే: బొత్స

By Arun Kumar PFirst Published Apr 14, 2020, 9:46 PM IST
Highlights
దేశవ్యాప్తంగా కరోనా వైరస్ వేగంగా  విస్తరిస్తున్న నేపథ్యంలో మే3 వరకు కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించిన విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా కలెక్టర్లు, ఎస్పీలతో  ముఖ్యమంత్రి జగన్ జరిపిన సమావేశ వివరాలను మంత్రి బొత్స సత్యనారాయణ వివరించారు.
గుంటూరు: లాక్ డౌన్ నిర్ణయం పొడిగింపు నేపధ్యంలో రాష్ర్టంలో కరోనా నియంత్రణ చర్యలు, వ్యవసాయరంగం, రేషన్ పంపిణి తదితర అంశాలపై ఈరోజు జిల్లా కలెక్టర్లు, ఎస్పీలతో ముఖ్యమంత్రి వైయస్ జగన్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారని రాష్ర్ట పురపాలకశాఖమంత్రి బొత్స సత్యనారాయణ వెల్లడించారు. కరోనా నియంత్రణ, కట్టడి కోసం చేపట్టాల్సిన నిర్ణయాలు అమలు పరచడం, రైతులకు ఇబ్బందులు లేకుండా పంటలకు మధ్దతు ధరలు వచ్చేలా చూస్తూ తగిన నిర్ణయాలు అమలుపరచడంపై ప్రముఖంగా చర్చ జరిగినట్లు బొత్స తెలిపారు.

''మే మూడోతేదీ వరకు లాక్ డౌన్ నిర్ణయం మంచిదే. కేంద్ర నిర్ణయాన్ని తూచా తప్పకుండా పాటించాలి. లాక్ డౌన్ నిర్ణయాన్ని మరింత పటిష్టంగా అమలుచేయాలని  వైఎస్ జగన్ కలెక్టర్లు, ఎస్పీలకు ఆదేశించారు'' అని పేర్కొన్నారు. 

''లాక్ డౌన్ నేపధ్యంలో రేపటినుంచి రెండో విడత రేషన్ పేదలకు అందించనున్నాం.  రేషన్ షాపులకు సంబంధించి అదనపు కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నాం. వాలంటీర్ల ద్వారా రేషన్ దారులకు కూపన్లు అందిస్తాం. కూపన్లపై ఉన్న సమయానికి వచ్చి రేషన్ తీసుకోవాలి. రేషన్ షాపుల వద్ద భౌతికదూరం పాటించేలా చర్యలు తీసుకున్నాం. అర్హత ఉన్న ప్రతి పేదవారికి ఐదురోజులలో రేషన్ కార్డు ఇస్తాం'' అని అన్నారు.  

''వేయిరూపాయల ఆర్దికసాయంపై కూడా చర్చించిన  సీఎం అర్హులైన ప్రతిఒక్కరికి  సాయం అందేలా చూడాలని కోరారు. వ్యవసాయరంగంపై దృష్టి సారించాలని...రైతులకు ఇబ్బంది కలగకూడదని అధికారులకు దిశానిర్దేశం చేశారు. వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై తగిన చర్యలు చేపట్టాలని చెప్పారు. ధాన్యం ప్రొక్యూర్ మెంట్ విషయంలో గ్రామాలలోనే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయమన్నారు'' అని  బొత్స వివరించారు.

''కరోనా ఎక్కడెక్కడ తీవ్రంగా ఉందో అక్కడ దృష్టిసారించి తగు చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు. తీవ్రంగా ఉన్నచోట్ల రెడ్ జోన్లు ఏర్పాటుచేసి నిత్యావసర వస్తువులు, కూరగాయలు వారి ఇళ్లకు చేర్చేలా చర్యలు తీసుకోవాలని ఆదేశాలు ఇచ్చారు'' అని వెల్లడించారు. 

''రాష్ట్రంలో కుటుంబఆరోగ్య సర్వే జరుగుతోంది.ఎవరికి ఆరోగ్యం బాగోకపోయినా వారికి వైద్యచికిత్స అందించి మెడిసిన్స్ అందేలా ఏర్పాటుచేయాలని చెప్పారు.  అధికధరలు, బ్లాక్ మార్కెటింగ్ కు అవకాశం లేకుండా చేయాలి. ప్రతి షాపు వద్ద ధరలపట్టిక ఏర్పాటుచేసి వాటికంటే అధిక ధరలకు విక్రయించేవారిపై చర్యలు తీసుకోవాలని సూచించారు'' అన్నారు.  
''కేంద్రం తీసుకున్న నిర్ణయాన్ని ముఖ్యమంత్రి సమర్ధిస్తూ గ్రామీణప్రాంతాలలో ఎవరికి ఇబ్బందులు లేకుండా చూడాలని కోరారు.  ఈ సందర్భంగా పలు అంశాలు అధికారులు జగన్  దృష్టికి తీసుకువచ్చారు. క్వారంటైన్ లలో ఉన్నవారు టెస్ట్ లలో నెగిటివ్ వచ్చింది కాబట్టి ఇళ్లకు వెళ్లిపోతామని అడుగుతున్నారని... కృష్ణా,గుంటూరు జిల్లాల అధికారులు ఆయన దృష్టికి తెచ్చారు'' అని బొత్స వివరించారు. 

 
click me!