
మొత్తానికి ఇటు టిడిపి పెద్దలు అటు ఆళ్ళ రామకృష్ణారెడ్డి ఇద్దరూ విజయం సాధించినట్లైంది. విలువైన భూములు తమ చేతిలో నుండి తప్పిపోకుండా కాపాడుకున్నందుకు టిడిపి సంతోషిస్తుంటే, గతంలో ఇచ్చేసిన ధరకన్నా మూడు రెట్లు ఎక్కువ ప్రభుత్వ ఖజనాకు దక్కుతున్నందుకు ఆళ్ళకు ఆనందంగా ఉంది. వేలంపాటలో ఎవరో పాడుకుంటే టిడిపికి ఎలా ఆనందమని అనుకుంటున్నారా? భూములు సొంతం చేసుకున్నది కడప జిల్లా, ప్రొద్దటూరు నియోజకవర్గానికి చెందిన టిడిపి నేత వరదరాజులరెడ్డికి దగ్గర బంధువట.
అయితే ఏకంగా 60 కోట్లు చెల్లించే స్తోమత సదరు సంస్ధకు లేదట. తెరవెనుక ముఖ్యులు ఉండి మొత్తం కథనడిపించారని ప్రచారం జరుగుతోంది. జిల్లాకే చెందిన మార్కెటింగ్ శాఖ మంత్రి ఆదినారాయణరెడ్డి రెండు రోజులుగా చెన్నైలోనే క్యాంపు వేసారట దీనికోసమే. వందల కోట్ల రూపాయల విలువైన సదావర్తి సత్రం భూములను కారుచౌకగా సొంతం చేసుకోవాలని వేసిన వ్యూహం మొత్తానికి ఫలించింది. కాకపోతే అనుకున్నదానికన్నా మూడింతలు ఎక్కువ ఖర్చు చేయాల్సి వచ్చింది. ప్రభుత్వ పరువు చెన్నై మెరీనా బీచ్ లో కలిసిపోయినా విలువైన ఆస్తి మాత్రం దక్కటమే సంతృప్తి.
సోమవారం జరిగిన బహిరంగ వేలం 84 ఎకరాల సత్రం భూములకు రూ. 60 కోట్ల ధర పలికింది. అదే ఏడాదిన్నర క్రితం చంద్రబాబు నామినేషన్ మీదిచ్చేసిన ధర కేవలం రూ. 22 కోట్లు. అంటే రూ. 60 కోట్ల విలువైన భూములను కాపు కార్పొరేషన్ ఛైర్మన్, తన మద్దతుదారుడు రామానుజయ్యకు అప్పనంగా రూ. 22 కోట్లకు కట్టబెట్టేసారు. అంటే చంద్రబాబు ప్రభుత్వం ఏ స్ధాయిలో దోపిడికి పాల్పడుతోందో అర్ధమవుతోంది.
వైసీపీ ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్డి కోర్టులో కేసు వేయబట్టి జరిగిన అవినీతి, మోసం ప్రపంచానికి తెలిసింది. మామూలుగా అయితే ఇంకా ఎక్కువ ధరే రావాల్సింది. కాకపోతే ఇక్కడ కూడా ప్రభుత్వంలోని పెద్దలు బహిరంగ వేలం పాటలో పాల్గొనాలనుకున్న వాళ్ళలో కొందరిని మ్యానేజ్ చేసారని ప్రచారం జరుగుతోంది. దాంతో ధర చివరకు 60.30 కోట్లకు చేరుకున్నాక పాట ఆగిపోయిందట.