నెల్లూరు జిల్లా కృష్ణపట్నానికి చెందిన బొనిగె ఆనందయ్య తన మందును ఈ రోజు నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ రోజు 2 వేల మందికి మందును అందిస్తారు. తొలుత సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకే అందిస్తారు.
నెల్లూరు: తన మందును బొనిగె ఆనందయ్య నేటి నుంచి పంపిణీ చేయనున్నారు. ఈ రోజు సోమవారం కేవలం 2 వేల మందికి మాత్రమే కరోనా మందును ఆయన పంపిణీ చేయనున్నారు. నెల్లూరు జిల్లా కృష్ణపట్నంలో ఆనందయ్య పంపిణీ చేస్తున్న మందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన ఈ రోజు నుంచి మందు పంపిణీ చేయడానికి ఏర్పాట్లు చేసుకున్నారు.
ఈ రోజు 5వేల మందికి మందు పంపిణీ చేయాలని అనుకున్నప్పటికీ అది సాధ్యం కావడం లేదని తెలుస్తోంది. తొలుత సర్వేపల్లి శాసనసభా నియోజకవర్గం ప్రజలకు మాత్రమే మందు పంపిణీ చేస్తారు. గ్రామ వాలంటీర్లు, స్వచ్ఛంద సంస్థల కార్యకర్తల ద్వారా ఈ మందు పంపిణీ చేయనున్నారు. కృష్ణపట్నంలో మందు పంపిణీ ఉండదని, ఎవరు కూడా కృష్ణపట్నం రావద్దని ఆనందయ్య చెప్పారు. సర్వేపల్లి నియోజకవర్గం ప్రజలకు మాత్రమే మందును పంపిణీ చేయనున్నట్లు ఆయన తెలిపారు. యాప్ ద్వారా ఇతర ప్రాంతాలవారికి మందు పంపిణీ చేయడానికి సమయం పడుతుందని ఆయన చెప్పారు.
undefined
మరోవైపు తిరుపతిలో వైసీపీ శాసనసభ్యుడు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి మందును తయారు చేయిస్తున్నారు. ఆనందయ్య కుమారుడి ద్వారా ఈ మందును తయారు చేయిస్తున్నారు. కాగా, కృష్ణపట్నంలో పోలీసులు 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. స్థానికేతరులను ఎవరినీ కృష్ణపట్నంలోకి అనుమతించడం లేదు. ఆధార్ కార్డు చూపిస్తేనే గ్రామంలోకి అనుమతిస్తున్నారు.
ఆనందయ్య మందు తయారీ కేంద్రాన్ని కృష్ణపట్నం పోర్టుకు తరలించారు. ఆనందయ్య తయారు చేస్తు్నన కంట్లో వేసే చుక్కల మందుకు మినహా మిగతా మందుల పంపిణీకి ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. కంట్లో వేసే చుక్కల మందు పంపిణీపై ఏపీ హైకోర్టు ఈ రోజు తన నిర్ణయాన్ని ప్రకటించనుంది.
కంట్లో వేసే చుక్కల మందుకు కూడా అనుమతి ఇవ్వాలని ఆనందయ్య హైకోర్టును కోరుతూ పిటిషన్ దాఖలు చేశారు. దానిపై విచారణ ముగిసింది. తన నిర్ణయాన్ని హైకోర్టు నేటికి రిజర్వ్ చేసింది.