
అమాయక యువకులకు ఏదో ఒక మాయమాటలు చెప్పి.. వారి వద్ద నుంచి సులభంగా డబ్బులు కాజేయడం ఈ మధ్య ఎక్కువైంది. తాజాగా ఓ యువతి రూ. కోటి ఆశచూ పించి రూ.80లక్షలు కాజేసింది. ఈ సంఘటన కృష్ణా జిల్లా లో చోటుచేసుకోగా.. ఈ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
కృష్ణా జిల్లా ఇబ్రహీంపట్నంకు చెందిన ఓ యువకుడు సెల్ ఫోన్ రిపేర్ షాప్ నిర్వహిస్తున్నాడు. అతని వద్దకు తరచూ శ్రీ విద్య అనే యువతి వచ్చేది. తొలుత సెల్ ఫోన్ రిపేర్ పేరిట వచ్చి పరిచయం పెంచుకొని.. తర్వాత నెమ్మదిగా.. అతనిని వలలో వేసుకుంది.
రోజూ ఫోన్ చేసేది. ఆమె మాటలకు సదరు యువకుడు బుట్టలో పడిపోయాడు. అతను తనను పూర్తిగా నమ్మేశాడు అని నమ్మకం రాగానే.. తన అసలు ప్లాన్ అమలు చేసింది. తనకు కోటిన్నర రూపాయలు విలువచేసే ల్యాండ్ ఉందని.. కానీ అది ప్రస్తుతం రూ.80లక్షలకు తాకట్టులో ఉందని చెప్పింది.
ఆ భూమిని విడిపించవా అని అడిగింది. ఆమె చెప్పింది నిజమనుకొని ఆమె కోరిన డబ్బు ఇచ్చేశాడు. విడతల వారీగా ఆమెకు రూ.80లక్షలు ఇచ్చాడు. తాకట్టు విడిపించాక మళ్లీ డబ్బు ఇచ్చేస్తానని చెప్పడంతో నమ్మి మోసపోయాడు. కానీ తనకు రావాల్సిన డబ్బు రాగానే యువతి కనిపించకుండా పోయింది. మోసపోయానని గ్రహించిన బాధితుడు పోలీసులను ఆశ్రయించాడు. దర్యాప్తులో ఆమె ఇదేవిధంగా చాలా మందిని మోసం చేసినట్లు తేలింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.