సాక్షి కథనాలు: వైఎస్ భారతికి రఘురామ కృష్ణం రాజు నోటీసు

By telugu teamFirst Published Jun 7, 2021, 8:12 AM IST
Highlights

ఏపీ సీఎం వైఎస్ జగన్ కు ఇబ్బందులు కలిగించేందుకు వైసీపీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు ప్రతి రోజూ ఏదో ఒక పనిచేస్తూనే ఉన్నారు. తాజాగా ఆయన వైఎస్ భారతి ఆధ్వర్యంలోని సాక్షి టీవీకి లీగల్ నోటీసు ఇచ్చారు.

న్యూఢిల్లీ: ఏపీ సిఐడి పెట్టిన కేసులో బెయిల్ మీద బయటకు వచ్చిన వైఎస్సార్ కాంగ్రెసు పార్టీ తిరుగుబాటు ఎంపీ రఘురామ కృష్ణం రాజు నిమ్మకు నీరెత్తినట్లు ఉండడం లేదు. రోజూ ఏదో ఒక పనిచేస్తూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ను ఇబ్బంది పెట్టే పనిచేస్తున్నారు. తాజాగా ఆయన జగన్ సతీమణి వైఎస్ భారతి నేతృత్వంలో నడుస్తున్న సాక్షి టీవీ చానెల్ కు లీగల్ నోటీసు ఇచ్చారు. 

రఘురామ కృష్ణమ రాజు తరఫున న్యాయవాది పీవీజీ ఉమేష్ చంద్ర ఈ నోటీసు జారీ చేశారు. తన పరువుప్రతిష్టలకు భంగం కలిగించే విధంగా తనకు వ్యతిరేకంగా, న్యాయవిరుద్ధంగా పలు కథనాలు ప్రసారం చేస్తున్నారని ఆరోపిస్తూ ఆ నోటీసు ఇచ్చారు. 

అందుకు గాను తనకు క్షమాపణలు చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. వారం రోజుల్లోగా స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకుంటానని ఆయన హెచ్చరించారు. ఇందిరా టెలివిజన్ ప్రైవేట్ లిమిటెడ్ చైర్ పర్సన్ వైఎస్ భారతీరెడ్డికి తదితరులకు ఆ నోటీసు జారీ చేశారు. 

ఆమెతో పాటు పాలకవర్గం డైరెక్టర్లకు కూడా ఆయన ఆ నోటీసు ఇచ్చారు. ఎడిటర్ ఇన్ చీఫ్ నేమాని భాస్కర్, కన్సల్టింగ్ ఎడిటర్ కొమ్మినేని శ్రీనివాస రావు పేర్లతో కూడా ఆ నోటీసులు ఇచ్చారు తన ప్రతిష్టకు భంగం కలిగించారంటూ చెప్పడానికి ఆయన కొన్ని కథనాలను ఆయన ఉదహరించారు. 

click me!