
విజయవాడ: తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బోండా ఉమామహేశ్వర రావును మరో భూవివాదం చుట్టుముట్టింది. విజయవాడలోని సబ్బరాయనగర్ వెంచర్‌లో స్థలం ఇస్తామని రూ. 35 లక్షలు వసూలు చేసినట్టు నందిగామకు చెందిన సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి ఆరోపించారు.
రిజిస్ట్రేషన్ సమయంలో తనతో మాట్లాడి రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని తనతో చెప్పారని బాధితులు అంటున్నారు. అయితే ఇపుడు స్థలం లేదు, సొమ్ము లేదంటూ మాగంటి బాబు, వాసు, వర్మ అనే వ్యక్తులు బోండా ఉమ పేరు చెప్పి బెదిరిస్తున్నారని సుబ్రహ్మణ్యం ఆరోపిస్తున్నారు. దీంతో ఎమ్మెల్యేతో సహా నలుగురిపై చర్యలు తీసుకోవాలని సుబ్రహ్మణ్యం నగర సీపీకి ఫిర్యాదు చేశాడు.
విజయవాడలో స్వతంత్ర్య సమరయోధుడి భూమిని బోండా ఉమ కబ్జా చేశారనే ఆరోపణలపై గతంలో దుమారం చెలరేగింది. ఆ తర్వాత ఇద్దరు మహిళలు పెనమలూరు డెవెలప్‌మెంట్ పేరుతో తన 86 సెంట్ల భూమిని ఆక్రమించారని జాయింట్ కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.
అభివృద్ధి పేరుతో తమ భూమిని కాజేయాలని ఎమ్మెల్యే బోండా ప్రత్నిస్తున్నారని పెనమలూరుకు చెందిన ఉమాదేవి, లక్ష్మీ భవాని జాయింట్ కలెక్టర్‌నకు ఫిర్యాదు చేశారు.