చంద్రబాబుతో విడదీయరాని బంధం.. అలిపిరి బ్లాస్ట్‌లో చావు అంచులదాకా వెళ్లొచ్చిన బొజ్జల

By Siva KodatiFirst Published May 6, 2022, 4:06 PM IST
Highlights

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి మంచి అనుబంధం వుంది. 2003లో జరిగిన అలిపిరి దాడి ఘటనలో చంద్రబాబుతో కలిసి చావు అంచుల దాకా వెళ్లొచ్చారు బొజ్జల. ఇటీవల పుట్టినరోజు సందర్భంగా బొజ్జల ఇంటికి వెళ్లి ఆయనను విష్ చేశారు బాబు. 
 

తెలుగుదేశం (telugu desam party) పార్టీ సీనియర్ నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణా రెడ్డి (bojjala gopala krishna reddy) కన్నుమూసిన సంగతి తెలిసిందే. పార్టీలో, ప్రభుత్వంలో పలు కీలక హోదాల్లో పనిచేసిన ఆయన మరణం టీడీపీకి (tdp) తీరనిలోటు. ప్రత్యేకించి అధినేత చంద్రబాబుతో (chandrababu naidu) ఆయనకు విడదీయరాని అనుబంధం వుంది. అది ఎంతలా అంటే 2003లో జరిగిన అలిపిరి దాడి ఘటనలో చంద్రబాబుతో కలిసి చావు అంచుల దాకా వెళ్లొచ్చారు బొజ్జల.

2003 అక్టోబర్ 1న నాటి ముఖ్యమంత్రి, టిడిపి అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో పాల్గొనేందుకు వెళ్తున్నారు. ఈ క్రమంలో సీఎం కాన్వాయ్‌ తిరుపతిలోని అలిపిరి (alipiri blast) వద్దకు రాగానే అప్పటి పీపుల్స్ వార్ గ్రూప్ (people's war group) నక్సలైట్లు శక్తివంతమైన క్లెమోర్‌మైన్లు పేల్చారు. ఈ ఘటనలో సీఎం చంద్రబాబుతో పాటు సీనియర్ నేతలు బొజ్జల గోపాలకృష్ణ రెడ్డి, చదలవాడ కృష్ణమూర్తి తదితరులు తీవ్రంగా గాయపడ్డారు. దీంతో వీరిని భద్రతా సిబ్బంది హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. 

Latest Videos

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఈ కేసులో  ఈ సుదీర్ఘ విచారణ అనంతరం 2014 సెప్టెంబర్ 26న న్యాయస్థానం తుది తీర్పును వెలువరించింది. ఈ కేసులో ముగ్గురికి నాలుగేళ్ల జైలు శిక్ష, ఒక్కొక్కరికి రూ.700 జరిమానా విధిస్తూ తిరుపతి అదనపు సహాయ సెషన్స్ కోర్టు తీర్పు చెప్పింది.  ఈ కేసులో నిందితులైన తిరుపతికి చెందిన జి.రామ్మోహన్‌రెడ్డి అలియాస్ తేజ, వైఎస్సార్‌జిల్లా వెంకటరెడ్డిగారి పల్లెకు చెందిన సడిపిరాళ్ల నరసింహారెడ్డి అలియాస్ రాజశేఖర్, చిత్తూరు జిల్లా దిగువ అంకమవారి పల్లెకు చెందిన ఎం.చంద్ర అలియాస్ కేశవ్ అలియాస్ వెంకటరమణకు నాలుగేళ్ల జైలుశిక్ష, జరిమానా విధించింది న్యాయస్థానం.

ఈ కేసుపై ఐజీ డీటీ నాయక్ నేతృత్వంలో డీఎస్పీ ఎస్‌ఎం వలీ ప్రత్యేక బృందంగా (సిట్) ఏర్పడి కేసును దర్యాప్తు చేశారు. తిరుపతి కోర్టులో 2004లో చార్జ్ షీట్ దాఖలు చేశారు. 96 మంది సాక్షులను చూపగా 76 మందిని కోర్టు విచారించింది. 131 పత్రాలను, 146 వస్తువులను కోర్టు పరిశీలించింది. ఈ కేసులో చంద్రబాబునూ 14వ సాక్షిగా కోర్టు విచారించింది.

ఇటీవల బొజ్జల గోపాలకృష్ణారెడ్డికి చంద్రబాబు జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. కొద్ది రోజుల క్రితం తీవ్ర ఆనారోగ్యంతో ఆసుపత్రిలో చికిత్స పొందిన బొజ్జల కోలుకుని ఇంట్లోనే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 15న బొజ్జల పుట్టిన రోజు కావడంతో చంద్రబాబు స్వయంగా హైదరాబాద్‌లోని గోపాలకృష్ణారెడ్డి ఇంటికి వెళ్లి ఆయనతో పాటు వారి కుటుంబ సభ్యులతో కొద్దిసేపు గడిపారు. బొజ్జల కుటుంబ సభ్యుల సమక్షంలో జరిగిన కేక్ కటింగ్ లో చంద్రబాబు పాల్గొన్నారు. బొజ్జలకు కేక్ తినిపించారు. బొజ్జల ఆరోగ్య పరిస్థితిని తెలుకుని... జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.

2014లో తన కేబినెట్లో ఉండగా మధ్యలోనే ఉద్వాసన పలికిన చంద్రబాబు చాలా కాలం తర్వాత తిరిగి బొజ్జలను పలకరించారు. కొంతకాలంగా అనారోగ్యంతో హైదరాబాద్ లోని ఇంటికే పరిమితమయ్యారు బొజ్జల. చాలా కాలం తర్వాత చంద్రబాబు తనను పరామర్శించడానికి రావడంతో బొజ్జల తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. ఆయనను చూడగానే చేతులు జోడించి అలాగే ఉండిపోయారు. చంద్రబాబు మాట్లాడుతున్నంత సేపు ఆయన చేతులు జోడించే ఉన్నారు. కోలుకుని తిరిగి పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటారని అనుకుంటుండగా.. అంతలోనే బొజ్జల గోపాలకృష్ణారెడ్డి మరణం టీడీపీ శ్రేణులను దిగ్భ్రాంతికి గురిచేసింది. 
 

click me!