
తిరుపతి: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయంలో క్షుద్రపూజలు జరిగిన ఆనవాళ్లు కనిపించాయి. ఈ యూనివర్సిటీలో లైబ్రరీ భవనం సమీపంలోని చౌరస్తాలో క్షుద్రపూజలు చేసినట్టుగా తెలుస్తున్నది. అక్కడ ముగ్గు, పుర్రె బొమ్మలు కనిపించాయి. అంతేకాదు, పసుపు, కుంకుమలు కూడా వేసినట్టు కనిపించింది.
రాత్రిపూట ఇక్కడ ముగ్గు సున్నం, ఉప్పు, బొగ్గుపొడితో ముగ్గు వేసినట్టుగా, రక్తం, కోడిగుడ్లతో పూజలు చేసినట్టుగా అనుమానిస్తున్నారు. ఎస్‌వీ యూనివర్సిటీలో ప్రాంగణంలో సీసీ కెమెరాలు సరిగా పని చేయడం లేవు. అలాగే, బలమైన సెక్యూరిటీ కూడా లేదు. దీంతో ఇలాంటి ఘటనలకు హద్దు లేకుండా పోతున్నది. ఏకంగా విద్యాక్షేత్రమైన యూనివర్సిటీలో మూఢ ఆచారం వెలుగు చూడటం స్థానికంగా కలకలం రేపింది. వర్సిటీ విద్యార్థులు, సిబ్బందినీ కలత పెట్టించింది.
Also Read: పోలీసులపైనే కేఏ పాల్ ఫిర్యాదు.. డీజీపీని కలిసి కంప్లైంట్.. ఎందుకంటే?
ఇదిలా ఉండగా, యూనివర్సిటీ పరిసరాలు.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డగా మారిపోయాయని విద్యార్థి సంఘాల నేతలు, సభ్యులు తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. ప్రాంగణంలో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండటానికి సీసీ కెమెరాలను సరి చేయాలని, ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. అలాగే, సెక్యూరిటీ గార్డుల సంఖ్యనూ పెంచాలని వారు పేర్కొన్నారు.