
BJP Vishnu Vardhan Reddy: ఉత్తరప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు వెళ్లిన ఏఐఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ కారుపై గురువారం కాల్పులు జరగడం తెలిసిందే. కాల్పుల ఘటన తర్వాత కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. ఎంపీ ఒవైసీ భద్రతపై సమీక్ష నిర్వహించిన కేంద్ర హోంశాఖ.. అసదుద్దీన్ ఒవైసీకి జెడ్ కేటగిరీ భద్రత కల్పించాలని నిర్ణయించింది. తక్షణమే ఒవైసీకి సెక్యూరిటీ భద్రత అమలు చేయాలని కేంద్రం ఆదేశించింది. ఒవైసీ ని సీఆర్పీఎఫ్ కమాండోలు 24 గంటలు పర్యవేక్షించనున్నట్లు సంబంధిత అధికారులు తెలిపారు.
ఈ ఘటనపై ఏపీ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్.విష్ణువర్ధన్ రెడ్డి సెటైరికల్ కామెంట్స్ చేశారు. "హలో ఒవైసీ గారూ... 15 నిమిషాలు పోలీసులను పక్కనబెడితే హిందువులకు గుణపాఠం చెప్పానని మీ తమ్ముడు అన్నాడు. మీరు కూడా ఉత్తరప్రదేశ్ లో ఎన్నికల తర్వాత యూపీ పోలీసులకు గుణపాఠం చెప్పాన్నారు. కానీ మీరే జెడ్ ప్లస్ భద్రత పొందాల్సి వచ్చింది. ఉత్తరప్రదేశ్ పోలీసులు కూడా మీకు రక్షణ కల్పిస్తారు కాదా.. ఇప్పుడు మీరు నిజంగా సురక్షితంగా ఉన్నననే భావన కలుగుతుందని ఆశిస్తున్నాం" అంటూ విష్ణువర్ధన్ రెడ్డి ట్వీట్ చేశారు.
కాగా, ఉత్తరప్రదేశ్ ఎన్నికల ప్రచారంలో భాగంగా అసదుద్దీన్ ఒవైసీ మేరఠ్ లోని కిథౌర్ లో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఈ ప్రచారం నుంచి తిరిగి ఢిల్లీకి వస్తుండగా.. హాపుర్- గాజియాబాద్ జాతీయ రహదారిపై ఛాజర్సీ టోల్ ప్లాజా దగ్గర ఒవైసీ వాహనంపై కొందరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. దీంతో వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. అయితే ఈ దాడిలో ఎవరికీ గాయాలు కాలేదు. కాల్పుల తర్వాత ఒవైసీ మరో వాహనంలో ఢిల్లీ వెళ్లిపోయారు. కాగా, ఒవైసీపై నిందితులు కాల్పులు జరిపిన దృశ్యాలు సీసీటీవీలో నమోదయ్యాయి.
ఈ ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు హాపుర్ ఎస్పీ దీపక్ భుకర్ తెలిపారు. నిందితులను సచిన్, శుభంగా గుర్తించారు.హిందూవుల మనోభావాలకు వ్యతిరేక ప్రకటనలు, వ్యాఖ్యలు చేసినందుకే ఓవైసీ పై కాల్పులు జరిపినట్లు ప్రాథమిక విచారణలో ఒప్పుకున్నారు. నిందితుల వద్ద పిస్టల్‌ను స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు వెల్లడించారు. మొత్తం ఐదు బృందాలు ఈ ఘటనపై దర్యాప్తు కొనసాగిస్తున్నాయని ఏడీజీ ప్రశాంత్ కుమార్ తెలిపారు. మరోవైపు, ఈ దాడి వెనుక రాజకీయ కోణాలు ఉన్నాయని, ఘటనపై దర్యాప్తునకు ఆదేశించాలని ఈసీ(ఎలక్షన్ కమిషన్)ని డిమాండ్ చేశారు ఒవైసీ.
జెడ్ ప్లస్ కేటగిరీలో.. నలుగురు నుంచి ఆరుగురు NSG కమాండోలు, పోలీసు సిబ్బందితో సహా 22 మంది సిబ్బంది ఉంటారు. ఇందులో ఒక ఎస్కార్ట్ వాహనంతో పాటు ఢిల్లీ పోలీసులు లేదా ఐటీబీపీ లేదా సీఆర్ఫీఎఫ్ సిబ్బంది ఉంటారు.