AP BJP: దూకుడు పెంచిన బీజేపీ.. టీడీపీ-జనసేనతో దూరమేనా?.. కమలం పార్టీ ప్లాన్ ఇదేనా?

By Mahesh K  |  First Published Feb 2, 2024, 4:54 PM IST

ఆంధ్రప్రదేశ్‌లో టీడీపీ, జనసేనతోపాటుగా బీజేపీ కలిసి వస్తుందా? లేదా? అనే చర్చ జరుగుతున్నది. బీజేపీ వైఖరి కోసం టీడీపీ, జనసేన పార్టీలు ఉత్కంఠగా ఎదురుచూస్తున్నాయి. ఎన్నికలు సమీపిస్తుండటంతో సీట్ల కేటాయింపుపై ఒత్తిడి పెరుగుతున్నది. కానీ, బీజేపీ నుంచి స్పష్టమైన సంకేతాలు రాకపోవడంతో ఈ రెండు పార్టీల ఆశావహులు టెన్షన్‌లో ఉన్నారు.
 


Andhra Pradesh: ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయ పరిణామాలు వేగంగా మారిపోతున్నాయి. అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికలు సమీపిస్తుండటంతో పార్టీలు చురుకుగా నిర్ణయాలు తీసుకుంటున్నాయి. నాయకుల చేరికలు, అభ్యర్థుల ప్రకటనలపై పార్టీలు ఫోకస్ పెడుతున్నాయి. అధికార వైసీపీ ఇది వరకే అభ్యర్థుల ప్రకటనలు చేస్తున్నది. ఇటీవలే ఐదో జాబితా విడుదల చేసింది. ప్రతిపక్షాలది ప్రత్యేక పరిస్థితిగా ఉన్నది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడిప్పుడే గ్రౌండ్ తయారు చేసుకుంటూ ఉంటే.. ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీ, జనసేనల పొత్తు బీజేపీ కారణంగా పెండింగ్‌లో పడింది. ఇంతకీ బీజేపీ వైఖరి ఏమటనేది తెలియక ఉభయ పార్టీల అధినేతలు, ఆశావహులు టెన్షన్‌లో ఉన్నారు. కానీ, ఏపీ బీజేపీ మాత్రం అనూహ్యంగా వేగం పెంచింది. పార్టీని విస్తరించడానికి, ప్రచారానికి సొంతంగా లెక్కలు వేసుకుంటున్నది. దీంతో టీడీపీ, జనసేనల్లో గందరగోళం మొదలైంది.

టీడీపీ, జనసేనల మధ్య ప్రచారం, సీట్లపై ప్రాథమికంగా ఒక అవగాహన కుదిరింది. అంతర్గతంగా సీట్ల సర్దుబాటు వ్యవహారాన్ని జరుపుకుంటున్నాయి. అభ్యర్థులను ప్రకటించడానికి ముందు బీజేపీ వైఖరి కోసం ఈ రెండు పార్టీలు ఎదురుచూస్తున్నాయి. టీడీపీ-జనసేన కూటమిలోకి బీజేపీ వచ్చి చేరుతుందా? లేక జనసేన నుంచి కూడా తెగదెంపులు చేసుకుని ఒంటరిగా బరిలోకి దిగుతుందా? అనేది తేలాల్సి ఉన్నది. ఇప్పటి వరకైతే జనసేనతో తమ పొత్తు ఉన్నదని చెబుతున్నది.

Latest Videos

Also Read: Thalapathy Vijay: పవన్ కళ్యాణ్, విజయ్‌లది ఒకే దారి!.. సేమ్ టు సేమ్!!

బీజేపీ అధిష్టానంతో పొత్తు విషయంపై మాట్లాడటానికి జనసేనాని పవన్ కళ్యాణ్ ప్రయత్నాలు చేస్తున్నారు. కానీ, అధిష్టానం నుంచి సంకేతాలు రావడం లేదు. కేంద్ర బడ్జెట్, జార్ఖండ్ వ్యవహారం వంటి వాటిలో బీజేపీ బిజీగా ఉన్నది. దీంతో టీడీపీ, జనసేనల సీట్ల కేటాయింపు ప్రక్రియ జాప్యం అవుతున్నది. ఇది ముప్పుగా పరిణమిస్తుందని కొన్ని నియోజకవర్గాల్లో ఉభయ పార్టీల ఆశావహులు ప్రచారానికి కూడా తెరలేపారు.

ఇదిలా ఉండగా పొత్తుపై నిర్ణయం ఖరారు చేయకుండా ఏపీ బీజేపీ దూకుడు పెంచింది. 25 పార్లమెంటు సెగ్మెంట్లలో కార్యాలయాలు ప్రారంభించింది. ప్రచార రథాలను ప్రారంభిస్తున్నది. ప్రచారానికి ఏకంగా కారవాన్‌లనే ఉపయోగిస్తున్నది. మొత్తం 175 అసెంబ్లీ సెగ్మెంట్లు, 25 పార్లమెంటు స్థానాల్లో అభ్యర్థుల కోసం సెర్చ్ ఆపరేషన్ కూడా ప్రారంభించింది. ప్రతి లోక్ సభ సెగ్మెంట్‌కు ముగ్గురు సభ్యులతో కమిటీ ఏర్పాటు చేసింది. ఈ విషయాలపై మిత్రపక్షమైన జనసేనతో సంప్రదింపులు లేకుండానే ఒంటరిగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటున్నది. ఇది జనసేనలోనూ కలవరాన్ని రేపుతున్నది.

Also Read: KCR: లోక్ సభ ఎన్నికల కోసం బీఆర్ఎస్ వ్యూహాలు.. గులాబీ దళం టార్గెట్ ఇదే

ఎన్నికల వరకు పరిస్థితులు ఎలా మారుతాయో తెలియదు. జనసేనతో పొత్తును కొనసాగించి టీడీపీతోనూ కలిసి ఎన్నికలకు పోవడమా? లేక ఒంటరిగా పోటీ చేయడమా? అనే ఆప్షన్‌ను వాయిదా వేసి పార్టీ నిర్మాణంపై ఫోకస్ పెట్టాలని అధిష్టానం నుంచి సంకేతాలు అందినట్టు తెలుస్తున్నది. అందుకే పొత్తు అనే మాట రాకుండా బీజేపీ అన్ని పనులు చకచకా చేసుకుంటున్నది. కాబట్టి, సమీప భవిష్యత్‌లో ఏ నిర్ణయం తీసుకోవడమైనా.. అన్ని ఆప్షన్‌లు బీజేపీ తన వద్దే ఉంచుకున్నది. ఏది జరిగినా బీజేపీ ఒంటరిగా కూడా పోటీకి సిద్ధంగానే ఉన్నదనే సంకేతాలు వెళ్లేలా? అందుకు క్యాడర్‌ను కూడా సంసిద్ధం చేసేలా ప్లాన్ వేసుకున్నట్టు తెలుస్తున్నది. 

ఈ నెల 4వ తేదీన బీజేపీ అగ్రనేతలు అమిత్ షా, రాజ్‌నాథ్ సింగ్, జేపీ నడ్డాలు ఏపీలో పర్యటించే అవకాశాలు ఉన్నాయి. అదే నాలుగో తేదీనే అనకాపల్లిలో జనసేన బహిరంగ సభ కూడా ఉండే అవకాశం ఉన్నది. బీజేపీ అగ్రనేతల పర్యటనలనే పొత్తుపై ఏదైనా నిర్ణయం తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

click me!