
భారతీయ జనతా పార్టీ తనను తాను చాలా ఎక్కువ అంచనా వేసుకుంటున్నట్లు అనిపిస్తోంది. రెండు రోజుల క్రితం జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర రావు చేసిన ప్రకటనే అందుకు నిదర్శనం. వచ్చే ఎన్నికల్లో తమ పార్టీ ఒంటరిగానే పోటీ చేస్తుందని చేసిన ప్రకటనపై సర్వత్రా చర్చ మొదలైంది. ఇక్కడే మురళీ ఆలోనలపై పలువురికి అనుమానాలు మొదలయ్యాయి. అసలు మురళికి రాష్ట్రంలోని పార్టీ పట్ల ఏమన్నా అవగాహన ఉందా? పార్టీ సంస్ధాగతంగా ఏమాత్రం గట్టిగా ఉంది అన్న విషయం తెలుసా? అనే విషయాలపై పార్టీ నేతలే మాట్లాడుకుంటున్నారు.
ఒక పార్టీ రాష్రంలోని అన్నీ స్ధానాల్లోనూ పోటీ చేయటమంటే చిన్నవిషయం కాదు. భాజపా విషయాన్నే తీసుకుందాం. రాష్ట్రంలో 175 అసెంబ్లీ నియోజకవర్గాలున్నాయి. 25 పార్లమెంట్ స్ధానాలున్నాయ్. పోటీ అంటే ఎవరికో ఒకరికి బి ఫారం ఇచ్చి పోటీలో నిలబెట్టటం కాదు కదా? నియోజకవర్గం మొత్తం తెలిసిన అభ్యర్ధి అయ్యుండాలి. పార్టీపైన పూర్తిస్ధాయి పట్టుండాలి. సొంతంగా అంగబలం, అర్ధబలం ఉండితీరాలి. అటువంటి వాళ్లు భాజపాలో ఎంతమంది ఉన్నారు?
ఇప్పటికిప్పుడు ఎన్నికలొస్తే పార్టీ తరపున పోటీ చేయటానికి 175 మంది అభ్యర్ధుల జాబితాను సిద్ధం చేసే పరిస్ధితి కూడా లేదు. ఏదో పోయిన ఎన్నికల్లో కాంగ్రెస్ నుండి కొంత మంది వెళ్లి భాజపాలో చేరారు కాబట్టి కొంతలో కొంతనయం. వాళ్లు చేరకపోయుంటే భాజపాను పట్టించుకునే వారే ఉండరు. కేంద్రంలో అధికారంలో ఉంది, రాష్ట్రంలో అధికారం పంచుకుంటున్నా గడచిన మూడేళ్ళల్లో పార్టీ బలోపేతమైంది లేదు. ఇతర పార్టీల నుండి తమ పార్టీలోకి వచ్చి చేరమని జాతీయ నాయకత్వం కోరినా ఏ పార్టీ నేతలూ స్పందించలేదు. దాన్ని బట్టే రాష్ట్రంలో భాజపా ఎంత బలంగా ఉందో అర్ధం చేసుకోవచ్చు.
ఈ విషయాలేవీ తెలీకుండానే మురళి ఒంటరిపోటీ గురించి ప్రస్తావించినట్లున్నారు. మురళ అవటానికి తెలుగు వ్యక్తే అయినా రాష్ట్రంలోని రాజకీయాలపై అవగాహన ఉందా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఏదో ఒక పార్టీతో పొత్తు పెట్టుకోకుండా ఒంటరిగా పోటీ చేసేంత సీన్ భాజపాకు లేదన్నది వాస్తవం. అది టిడిపి కావచ్చు లేదా వైసీపీ కావచ్చు లేదా జనసేన కూడా కావచ్చు. కానీ పొత్తు అన్నది మాత్రం భాజపాకు తప్పదు.