వర్సిటీ పేరు మార్పు.. జూనియర్ ఎన్టీఆర్‌పై ట్రోలింగ్ : ‘దగా’ రాజకీయమేనన్న జీవీఎల్, జగన్‌కూ చురకలు

By Siva KodatiFirst Published Sep 25, 2022, 3:18 PM IST
Highlights

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందన సరిగా లేదంటూ జరుగుతోన్న ట్రోలింగ్‌పై బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఇది రాజకీయ వికృతానికి,'దగా' రాజకీయాలకు పరాకాష్ట అంటూ జీవీఎల్ ఫైరయ్యారు. 

ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సీటీ పేరు మార్పు వ్యవహారం ఆంధ్రప్రదేశ్‌లో కాకరేపుతోంది. రెండు మూడు రోజులుగా వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ సహా పార్టీలకతతీంగా నేతలు విరుచుకుపడుతున్నారు. అటు ఎన్టీఆర్ కుటుంబ సభ్యులు కూడా వైఎస్ జగన్‌పై భగ్గుమన్నారు. ముఖ్యంగా ఎమ్మెల్యే, సినీనటుడు నందమూరి బాలకృష్ణ చేసిన వ్యాఖ్యలు ప్రకంపనలు సృష్టిస్తున్నాయి. దీనికి మంత్రులు, వైసీపీ నేతలు ఘాటుగా బదులిస్తున్నారు. తాజాగా బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు స్పందించారు. ఈ మేరకు ఆదివారం ఆయన వరుస ట్వీట్లు చేశారు. 

‘‘ యుగ పురుషుడు ఎన్టీఆర్ గారినుంచి టీడీపీని దక్కించుకోవటం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు, ఈరోజున ఆయనపై 'అతిప్రేమ'ను ఒలకబోస్తూ జూ.ఎన్టీఆర్ ను "నువ్వు వారసుడివా" అని వెక్కిరించటం, అవమానించటం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి,'దగా' రాజకీయాలకు పరాకాష్ట అంటూ జీవీఎల్ ఫైరయ్యారు. 

ALso REad:అలా తెచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదు.. ఎన్టీఆర్ హెల్త్ వర్సిటీ పేరు మార్పుపై స్పందించిన జూ. ఎన్టీఆర్

‘‘ భగవంతుడి ప్రతిరూపంగా ప్రజల మనసులో నిలిచిన ఎన్టీఆర్ గారిని వివాదంలో లాగిన వైసీపీ చేసింది ముమ్మాటికీ దుర్మార్గమే. ప్రభుత్వ వ్యతిరేకత నుండి ప్రజల దృష్టిని మరల్చటం కోసం ఆరోగ్య విశ్వవిద్యాలయం పేరు మార్చారు. సీ.ఎన్టీఆర్ గారి మనసును మీ వికృత రాజకీయాల కోసం క్షోభ పెట్టొద్దు సిఎం వైఎస్ జగన్’’ అంటూ నరసింహారావు హెచ్చరించారు. 

ఇకపోతే... ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు వ్యవహారంపై జూనియర్ ఎన్టీఆర్ స్పందించారు. ఎన్టీఆర్, వైఎస్సార్ విశేష ప్రజాదరణ సంపాదించిన గొప్ప నాయకులు అని అన్నారు. ఈ రకంగా ఒకరి పేరు తీసి ఒకరు పేరు పెట్టడం ద్వారా వచ్చే గౌరవం వైఎస్సార్ స్థాయిని పెంచదని.. అలాగే ఎన్టీఆర్ స్థాయిని తగ్గించదని పేర్కొన్నారు. విశ్వవిద్యాలయానికి పేరు మార్చడం ద్వారా ఎన్టీఆర్ సంపాదించుకున్న కీర్తిని, తెలుగు జాతి చరిత్రలో వారి స్థాయిని, తెలుగు ప్రజల హృదయాలలో ఉన్నవారి జ్ఞాపకాలు చెరిపివేయలేరని అన్నారు. 

అయితే వర్సిటీ పేరు మార్పు వ్యవహారంలో జూనియర్ ఎన్టీఆర్ స్పందించిన తీరుపై తెలుగుదేశం పార్టీతో పాటు అన్నగారి అభిమానుల నుంచి తీవ్ర అసంతృప్తి వ్యక్తమవుతోంది. ఎన్టీఆర్‌తో పాటు వైఎస్సార్‌ను మహనీయుడిగా అభివర్ణించడం సరికాదంటున్నారు. తాత పేరు మార్చడంపై అగ్గిమీద గుగ్గిలంలా వ్యవహరించాల్సిన జూనియర్ గోడ మీద పిల్లి మాదిరిగా ప్రవర్తించారని, అసలు నువ్వు వారసుడివేనా అన్నట్లు సోషల్ మీడియాలో ట్రోలింగ్ జరుగుతోంది. దీనిపైనే జీవీఎల్ స్పందించారు. 


 

యుగ పురుషుడు ఎన్టీఆర్ గారినుంచి టీడీపీని దక్కించుకోవటం కోసం ఒకప్పుడు ఒక పోటు పొడిచి ఆయన మరణానికి కారకులైనవారు, ఈరోజున ఆయనపై 'అతిప్రేమ'ను ఒలకబోస్తూ జూ.ఎన్టీఆర్ ను "నువ్వు వారసుడివా" అని వెక్కిరించటం, అవమానించటం, కార్యకర్తలను ఉసిగొల్పడం రాజకీయ వికృతానికి,'దగా' రాజకీయాలకు పరాకాష్ట.

— GVL Narasimha Rao (@GVLNRAO)
click me!