బీజేపీకి రాజీనామా చేసిన కన్నా లక్ష్మీనారాయణపై వ్యాఖ్యలు చేసే విషయంలో ఆ పార్టీ నాయకులు ఆచితూచి స్పందిస్తున్నారు.
గుంటూరు: రాజకీయ దురుద్దేశంతో కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలు చేశారని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు చెప్పారు. గురువారం నాడు గుంటూరులో ఆయన మీడియాతో మాట్లాడారు. పార్టీకి రాజీనామా చేసిన సమయంలోనూ, అంతకు ముందు కన్నా లక్ష్మీనారాయణ సోము వీర్రాజుపై చేసిన వ్యాఖ్యలు దురదృష్టకరమైనవిగా ఆయన పేర్కొన్నారు. పార్టీ నిర్ణయం ప్రకారంగానే సోము వీర్రాజు వ్యవహరిస్తున్నారని ఆయన చెప్పారు. పార్టీ జాతీయ నాయకత్వం ఇచ్చిన ఆదేశాలను సోము వీర్రాజు రాష్ట్రంలో అమలు చేశారని జీవీఎల్ నరసింహరావు చెప్పారు. ఇందులో సోము వీర్రాజు వ్యక్తిగతంగా తీసుకున్న నిర్ణయాలేవీ లేవన్నారు.కన్నా లక్ష్మీనారాయణకు పార్టీీలో సముచిత గౌరవం ఇచ్చినట్టుగా చెప్పారు. పార్టీ రాష్ట్ర అధ్యక్ష బాధ్యతలు కూడా కన్నా లక్ష్మీనారాయణ నిర్వహించారని ఆయన గుర్తు చేశారు.
also read:బీజేపీకి కన్నా రాజీనామా : వ్యాఖ్యానించేందుకు నిరాకరించిన జీవీఎల్
undefined
తనపై కన్నా లక్ష్మీనారాయణ చేసిన వ్యాఖ్యల గురించి స్పందించబోనని ఆయన చెప్పారు. గతంలో కూడా ఇదే తరహలో ఆయన వ్యాఖ్యలు చేశారని జీవీఎల్ నరసింహరావు తెలిపారు. ఎవరికి ఉండే వ్యక్తిగత అభిప్రాయాలు వారికుంటాయన్నారు.
ఎంపీగా తన బాధ్యతలను సమర్ధవంతంగా నిర్వహించినట్టుగా జీవీఎల్ నరసింహరావు చెప్పారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి పదవి ప్రధానమైందన్నారు. ఇతర పార్టీల నుండి వచ్చిన వ్యక్తులకు బీజేపీ రాష్ట్ర అధ్యక్ష పదవిని ఇవ్వరని చెప్పారు. కానీ వేరే పార్టీ నుండి వచ్చిన కన్నా లక్ష్మీనారాయణకు బీజేపీ అధ్యక్ష పదవిని కూడా బీజేపీ నాయకత్వం కట్టబెట్టిందని ఆయన చెప్పారు. ఇలాంటి సందర్భం అత్యంత అరుదు అని జీవీఎల్ నరసింహరావు వివరించారు.