
వైసీపీ, టీడీపీలపై మండిపడ్డారు బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహారావు. శుక్రవారం విశాఖలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... వైసీపీతో తమకు రాజ్యాంగబద్ధ సంబంధాలే వున్నాయన్నారు. భవిష్యత్తులో వైసీపీకి జనసేన, బీజేపీలే ప్రత్యామ్నాయమని జీవీఎల్ పేర్కొన్నారు. పోలవరం మాదంటే మాదని వైసీపీ, టీడీపీలు ప్రగల్భాలు పలుకుతున్నాయని.. పోలవరం ప్రాజెక్ట్ ఆలస్యం కావడానికి జగన్ ప్రభుత్వమే కారణమని నరసింహారావు ఆరోపించారు.
విశాఖలో భూములు దోపిడికి గురవుతున్నాయని.. దీనిపై అధికార , ప్రతిపక్షాలు చర్చకు రావాలని ఆయన డిమాండ్ చేశారు. ఉత్తరాంధ్రలోని రిజర్వాయర్లకు కనీసం మరమ్మత్తులు జరగలేదన్నారు. వచ్చే ఏడాది నాటికి విశాఖకు 5 జీ సేవలు అందిస్తామని, అలాగే నగరం నుంచి తిరుపతి, హైదరాబాద్, బెంగళూరుకు వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైళ్లు నడుస్తాయని జీవీఎల్ నరసింహారావు తెలిపారు. మోడీ పర్యటన సందర్భంగా ఏర్పాటు చేసిన సభ నిర్వహణ ఖర్చులో అత్యధికం కేంద్రమే ఖర్చు చేసిందని జీవీఎల్ పేర్కొన్నారు.
Also REad:పవన్ కల్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన బీజేపీ ఎంపీ జీవీఎల్.. ఏం చెప్పారంటే..
14 ఏళ్ల సీఎంగా వున్న చంద్రబాబు నాయుడు ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్ట్‌లు ఎందుకు పూర్తి చేయలేదో చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. తాను పుట్టిన రాయలసీమకు, ముఖ్యంగా చిత్తూరు జిల్లాకు చంద్రబాబు ఎలాంటి మేలు చేయలేదని జీవీఎల్ నరసింహారావు ప్రశ్నించారు. పోలవరంలో జరిగిన అవినీతిపై రాష్ట్ర ప్రభుత్వం విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు.