
టీడీపీ (tdp) ఎంపీ కేశినేని నానికి (kesineni nani) బీజేపీ (bjp) ఎంపీ సీఎం రమేశ్ (cm ramesh) కౌంటర్ ఇచ్చారు. తనపై అసత్య ఆరోపణలు, కల్పితాలు ప్రచారం మానాలని ఆయన సూచించారు. కుటుంబ వ్యవహారాలు, వాళ్ల పార్టీలో లుకలుకలు సరిచేసుకోవడం మంచిదని సీఎం రమేశ్ చురకలు వేశారు. ఊహలకు, ఊహాజనిత వార్తలకు నిజాలు కానీ, ఆధారాలు కానీ అవసరం లేదని ఆయన అన్నారు.
ఇకపోతే.. కేశినేని నాని దేశ రాజధానిలో కొన్ని వ్యాఖ్యలు చేశారంటూ మీడియాలో కథనాలు చక్కర్లు కొడుతున్నాయి. మహారాష్ట్రలో ఏక్ నాథ్ షిండే మాదిరిగా ఏపీ టీడీపీలో బీజేపీ ఎంపీ సీఎం రమేశ్ ఉన్నారని, వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 50-60 సీట్లు వస్తే వాటిని రమేశ్ బీజేపీలోకి పట్టుకెళతాడని కేశినేని అన్నట్టుగా ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలోనే సీఎం రమేశ్ స్వయంగా వివరణ ఇచ్చారు.
ALso REad:నకిలీ స్టిక్కర్‌పై పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేశాను.. ఎంపీ కేశినేని నాని
కాగా.. విజయవాడ టీడీపీ ఎంపీ కేశినేని నాని కుటుంబంలో విబేధాలు తారాస్థాయికి చేరాయి. తన పేరుతో ఉన్న ఎంపీ నకిలీ స్టిక్కర్‌ను కొందరు వినియోగిస్తున్నారని కేశినాని నాని ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. అయితే తాజాగా ఈ వివాదంపై కేశినేని స్పందించారు. ఎంపీ వాహనానికి ఉండే మాదిరి నకిలీ స్టిక్కర్ సృష్టించారని.. ఎంతోకాలంగా తన పేరుతో నకిలీ ఎంపీ స్టిక్కర్ ఉపయోగిస్తున్నారని ఆరోపించారు. రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్న వ్యక్తి ఎంపీ స్టిక్కర్ పేరుతో బెదిరింపులు, మోసాలకు పాల్పడుతున్నారని అన్నారు.
పార్లమెంట్‌లో ఒక ఎంపీకి ఒక్క స్టిక్కర్ మాత్రమే ఇస్తారని చెప్పారు. నకిలీ స్టిక్కర్‌పై పార్లమెంట్ సెక్రటరీ జనరల్‌కు ఫిర్యాదు చేసినట్టుగా తెలిపారు. తెలుగు రాష్ట్రాల డీజీపీలకు కూడా ఫిర్యాదు చేసినట్టుగా వెల్లడించారు. ఈ ఫిర్యాదులో రాజకీయాలతో సంబంధం లేదని అన్నారు.
అసలేం జరిగిందంటే..
తన పేరు, హోదాను ఉపయోగించి గుర్తుతెలియని వ్యక్తులు చలామణి అవుతున్నారని కేశినేని నాని పోలీసులకు ఫిర్యాదు చేశారు. విజయవాడ ఎంపీగా తాను వినియోగించే వీఐపీ వాహనం స్టిక్కర్ నకిలీది రూపొందించి.. దానితో విజయవాడ, హైదరాబాద్‌లలో తిరుగుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ వ్యక్తిపై చర్యలు తీసుకోవాలని కోరారు. అలా వాడుతున్న వాహనం నెంబర్ టీఎస్ 07 హెచ్ 7777గా పేర్కొన్నారు. కేశినేని నాని ఫిర్యాదు చేసిన రెండు వారాల తర్వాత.. జూన్ 9వ తేదీన ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు.
రెండు రోజుల క్రితం మాదాపూర్ పోలీసులు వాహనాన్ని ఆపి తనిఖీలు చేయడంతో వ్యవహారం బయటకొచ్చింది. అసలు విషయం తెలుసుకున్న నాని సోదరుడు శివనాధ్ అలియాస్ చిన్ని వాహనానికి సంబంధించిన పత్రాలు చూపించారు. అయితే కేశినేని నాని ఫిర్యాదులో పేర్కొన్న వాహనం.. తన సోదురుడు చిన్న భార్య జానకి లక్ష్మి పేరు ఉంది. దీంతో సొంత సోదరుడి కుటుంబంపైనే కేశినేని నాని ఫిర్యాదు చేయడం ఇప్పుడు సంచలనంగా మారింది. ఇక, గత కొంతకాలంగా కేశినేని కుటుంబలో రాజకీయ చిచ్చు కొనసాగుతున్నట్టుగా ప్రచారం సాగుతున్న సంగతి తెలిసిందే.