
ఆంధ్రప్రదేశ్‌లో అధికార వైసీపీపై మాజీ ఎమ్మెల్యే, బీజేపీ నేత విష్ణు కుమార్ రాజు తీవ్ర విమర్శలు చేశారు. ఏపీకి పట్టిన చీడ వైసీపీ ప్రభుత్వం అని.. అటువంటి ప్రభుత్వాన్ని ఎన్నుకున్న ప్రజలకు బాగా బుద్ది వచ్చిందని అన్నారు. 2024లో వైసీపీ అధికారం కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు. కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న నిధులను జగన్ ప్రభుత్వం పక్కదారి పట్టిస్తుందని ఆరోపించారు. ఎస్సీ, ఎస్టీలకు జగన్ ప్రభుత్వం తీవ్ర అన్యాయం చేస్తోందని మండిపడ్డారు. ఎస్సీ సబ్ ప్లాన్ నిధులను డైవర్టు చేస్తున్నారని ఆరోపించారు. కులాలకు, మతాలకు అతీతంగా ప్రజలంతా వైసీపీకి ఓటు వేయద్దని కోరారు.
వైసీపీ ప్రభుత్వం దిక్కుమాలిన ప్రభుత్వమని విమర్శించారు. అమరావతిని ఏకైక రాజధానిగా కొనసాగించాలని ఆ ప్రాంత రైతులు ఎన్ని దీక్షలు చేసినా పట్టించుకోలేదన్నారు. ఆదాని గ్రూప్ మీద సీఎం వైఎస్ జగన్‌కు ఎందుకంత ప్రేమో అర్థం కావడం లేదని అన్నారు. అప్పుల్లో ఉన్న ఆదానికి మరో 60 ఎకరాలు ఎందుకు ఇచ్చారని ప్రశ్నించారు. కృష్ణపట్నం, గంగవరం పోర్టును జగన్ అదానీకి దోచిపెట్టారని ఆరోపించారు. రాష్ట్రంలో జగన్ భారీగా దోపిడి చేస్తున్నారని మండిపడ్డారు.