ఈ బిజెపి నేత ఎలా రెచ్చిపోయారో ?

First Published Jan 1, 2018, 10:10 AM IST
Highlights
  • భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు

అధికారంలో భాగస్వాములమనో లేకపోతే కేంద్రంలో అధికారంలో ఉన్నామనో తెలీదు కానీ భారతీయ జనతా పార్టీ నేతలు కూడా రెచ్చిపోతున్నారు. నెల్లూరులో తాజాగా జరిగిన సంఘటనే అందుకు ఉదాహరణగా నిలిచింది. టోల్ గేట్ సిబ్బందిపై భాజపా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సన్నపరెడ్డి సురేష్ రెడ్డి రెచ్చిపోయారు. టోల్ గేటు ప్లాజాలో కౌంటర్ అద్దాలు పగలగొట్టించారు. అడ్డొచ్చిన సిబ్బందిపై దౌర్జన్యం చేయించారు.

ఇంతకీ ఏమి జరిగిందంటే, గుడూరు సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద ఆందోళనకు భాజపా పిలిపిచ్చింది. అందుకని తన ఇంటి నుండి బయలుదేరిన సురేష్ రెడ్డి వెంకటాచలం వద్ద ఉన్న టోల్ ప్లాజా వద్దకు చేరుకున్నారు. వాహనాలకు టోల్ ఫీజు చెల్లించాలని సిబ్బంది అడగ్గానే సురేష్ రెచ్చిపోయారు. తాను ఫీజు కట్టేది లేదని, తమను పంపేయాలని డిమాండ్ చేసారు. అందుకు సిబ్బంది అంగీకరించలేదు. దాంతో సురేష్ తో పాటు అనుచరులు కూడా రెచ్చిపోయారు. తమ నేత చెప్పటంతో ప్లాజాపై దాడిచేసారు. కౌంటర్ అద్దాలు పగలగొట్టారు. సరే, మొత్తానికి టోల్ చెల్లించకుండానే వెళ్ళిపోయారు.

అయితే, సాయంత్రం అదే దారిలో సురేష్ అనుచరులతో వెనక్కు వచ్చారు. దాంతో టోల్ ప్లాజా సిబ్బంది మళ్ళీ అడ్డుకున్నారు. ఉదయం జరిగిన ఘటనను తమ యాజమాన్యానికి చెప్పారు. టోల్ కట్టకపోయిన పర్వాలేదు కనీసం జరిగిన డ్యామేజిని వసూలు చేయమని చెప్పారట. అందుకనే సాయంత్రం టోల్ వద్దకు వచ్చినపుడు డ్యామేజి చెల్లించమని అడిగారు. దాంతో మళ్ళీ రెచ్చిపోయిన సురేష్ అనుచరులు మళ్ళీ వారిపై దౌర్జన్యం చేసారు. దాంతో చేసేదిలేక  టోల్ సిబ్బంది పోలీసులకు ఫిర్యాదు చేసారు. వెంకటాచలం పోలీసులు ఫిర్యాదు ఆధారంగా సురేష్ తో పాటు మరో ఏడుగురిపై కేసు నమోదు చేసారు. సిసి ఫుటేజిని స్వాధీనం చేసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు.

click me!