చిరులా పవన్ అవుతారా, బాబు ఓటమి ఈజీనా: బిజెపి నేత విశ్లేషణ ఇదీ...

First Published Jun 9, 2018, 8:54 AM IST
Highlights

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తనదైన విశ్లేషణ అందించారు.

న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని రాజకీయ పరిస్తితులపై బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్ రావు తనదైన విశ్లేషణ అందించారు. ఆయన శుక్రవారం ఢిల్లీలో మీడియాతో మాట్లాడారు. జనసేన పవన్ కల్యాణ్ భవిష్యత్తుపై, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి రాజకీయాలపై ఆయన మాట్లాడారు.

వచ్చే ఎన్నికల్లో చంద్రబాబును ఓడించడం మామూలు విషయం కాదని, ఆయన్ని ఓడించడానికి ముందు చాలా శక్తులను ఓడించాలని, ఇంకా ఎన్నో ప్రణాళికలు వేయాల్సి ఉందని మురళీ అన్నారు. చంద్రబాబును మళ్లీ ముఖ్యమంత్రి కానివ్వకుండా చేయడమే తమ లక్ష్యమని అన్నారు. 

సార్వత్రిక ఎన్నికలకు ఆరు నెలల ముందు ఎన్డీయే నుంచి తెలుగుదేశం బయటపడుతుందని తాము అంచనా వేశామని, కానీ తమ అంచనాలకు భిన్నంగా చంద్రబాబు వ్యూహాత్మకంగా ఏడాదికి ముందే తమతో తెగదెంపులు చేసుకున్నారని అన్నారు. 
కేంద్రానికి వ్యతిరేకంగా ఆంధ్రప్రదేశ్ ప్రజలను రెచ్చగొట్టి ఎన్నికల్లో విజయం సాధించాలనే చంద్రబాబు వ్యూహం కచ్చితంగా నెరవేరుతుందని చెప్పలేమని అన్నారు. ఎన్నికలనాటికి ఏ అంశాలు ప్రధానంగా మారతాయో ఇప్పటి నుంచే చెప్పడం కష్టమని కూడా అన్నారు. 

ఎన్నికల్లో ఓడిపోతే తెలుగుదేశం పార్టీ అస్తిత్వానికే ముప్పు వాటిల్లుతుందనే ఉద్దేశంతోనే చంద్రబాబు రాజకీయ క్రీడ ప్రారంభించారని అన్నారు. ఏ పరిణామాన్నీ తేలిగ్గా వదలకుండా చివరిదాకా పోరాడే శక్తి ఆయనలో ఉందని అన్నారు. తమ పార్టీ ఇంకా పూర్తి స్థాయిలో రంగంలోకి దిగలేదని చెప్పారు. 

గతంలో చిరంజీవి విఫలమైనట్లు పవన్‌ కల్యాణ్ కూడా విఫలమవుతారనే అంచనా సరైంది కాదని ఆయన అభిప్రాయపడ్డారు. చిరంజీవి ప్రజారాజ్యం స్థాపించినప్పటి పరిస్థితులు ఇప్పుడు లేవని, పరిస్థితుల్లో చాలా మార్పు ఉందని, రాష్ట్రంలో రాజకీయ సమీకరణాలు భిన్నంగా ఉన్నాయని ఆయన చెప్పారు. వివిధ వర్గాలను తనతో తీసుకెళ్లగలిగిన సామర్య్థాన్ని పవన్‌ కల్యాణ్‌ ప్రదర్శించాల్సి ఉందని అన్నారు.

click me!