ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జనసేన, బీజేపీ నేతలు గురువారం నాడు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని రెండు పార్టీల నేతలు కోరారు.
అమరావతి: ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ తో జనసేన, బీజేపీ నేతలు గురువారం నాడు భేటీ అయ్యారు. స్థానిక సంస్థల ఎన్నికలు సజావుగా జరిగేలా చూడాలని రెండు పార్టీల నేతలు కోరారు.
ఏపీలో స్థానిక సంస్థల ఎన్నికల షెడ్యూల్ విడుదలైంది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతోంది. ఎన్నికల ప్రక్రియ సజావుగా సాగేందుకు చర్యలు తీసుకోవాలని జనసేన, బీజేపీ నేతలు గవర్నర్ కు వినతి పత్రం సమర్పించారు.
బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు, కన్నా లక్ష్మీనారాయణ, ముధుకర్ జీ, జనసేన తరపున నాదెండ్ల మనోహర్, శ్రీనివాస్ యాదవ్ లు గవర్నర్ తో భేటీ అయ్యారు.
ఈ సందర్భంగా బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు మీడియాతో మాట్లాడారు. కేసులు పెట్టి తమ పార్టీ కార్యకర్తల్ని భయపెట్టే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.
ఆలయాల్లో దాడుల్లో బీజేపీ పాత్ర ఉందని చెప్పడం దారుణంగా ఉందన్నారు. వైసీపీ ప్రభుత్వం మతతత్వాన్ని రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తోందని ఆయన ఆరోపించారు. ప్రభుత్వ డబ్బులతో చర్చిల నిర్మాణం నిర్మిస్తున్నారన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా జరిగాలని తాము కోరినట్టుగా ఆయన చెప్పారు.
రాష్ట్రం లో నెలకొన్న రాజకీయ పరిస్థితులు గవర్నర్ కు వివరించామన్నారు.గతంలో నామినేషన్ లు కూడా వేయకుండా అధికార పార్టీ అడ్డుకున్న విషయాన్ని ఆయన గుర్తు చేశారు.ఈసారి ఇలాంటి పరిస్థితి లేకుండా చూడాలని గవర్నర్ ని కోరినట్టుగా చెప్పారు.
ఏకగ్రీవాలు సహజమే అయినా... ప్రలోభ పెట్టి, భయపెట్టి చేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. వివిధ ప్రాంతాలలో జరిగిన ఘటనలు కూడా వివరించామన్నారు. తుఫాన్ వల్ల నష్టపోయిన రైతులకు సాయం ఇవ్వలేదని చెప్పారు.
ఆలయాల పై జరుగుతున్న దాడులను కూడా వివరించామన్నారు.వాలంటీర్ ల ద్వారా అధికార పార్టీ నేతలు అక్రమాలకు పాల్పడుతున్నారని వీర్రాజు ఆరోపించారు. ఎన్నికల కమిషన్ కు అధికార యంత్రాంగం సహకరించాల్సిందిగా ఆయన కోరారు.
హై సెక్యూరిటీ జోన్ లో ఎన్నికల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాలని ఆయన కోరారు. ఆన్ లైన్ లో నామినేషన్లు స్వీకరించాలని ఆయన డిమాండ్ చేశారు. వాలంటీర్లతో బెదిరింపులకు పాల్పడుతున్నారని ఆయన ఆరోపించారు.
స్థానిక సంస్థల ఎన్నికలలో అధికారపార్టీ అనేక అరాచకాలకు పాల్పడిందన్నారు. ఈసారి అలా జరగకూడదని గవర్నర్ ను కలిశామన్నారు. ప్రజాస్వామ్య బద్దంగా ఎన్నికలు జరిగేలా ప్రభుత్వాన్ని ఆదేశించాని కోరినట్టుగా ఆయన చెప్పారు.
ఆలయాల పై దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం తో వ్యవహరిస్తుందన్నారు. ఎక్కడా కూడా సిట్ వేసి విచారణ వేగ వంతం కూడా చేయలేదన్నారు.విపక్ష కార్యకర్తలను దోషులుగా అక్రమ కేసులు పెట్టారని మనోహర్ ఆరోపించారు. మేము ప్రజా ఉద్యమానికి పిలుపునిస్తే హౌస్ అరెస్టు లు చేస్తున్నారన్నారు.