చంద్రబాబు నాయుడు సీఎంగా ఉన్న సమయంలో కేంద్ర మంత్రి అమిత్ షా కాన్వాయ్ పై దాడి జరిగిందని బీజేపీ ఏపీ చీఫ్ సోమువీర్రాజు చెప్పారు. పవన్ కళ్యాణ్ కు చంద్రబాబు సంఘీభావం తెలపడాన్ని ఆయన స్వాగతించారు
అమరావతి: చంద్రబాబునాయుడు సీఎంగా ఉన్న సమయంలో కూడా ఇతర పార్టీల నేతలపై దాడులు జరిగాయని బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు చెప్పారు.
గురువారంనాడు ఆయన అమరావతిలో మీడియాతో మాట్లాడారు. గతంలో తిరుపతిలో కేంద్ర మంత్రి అమిత్ షా పర్యటించిన సమయంలో అమిత్ షా కాన్వాయ్ పై టీడీపీ క్యాడర్ దాడికి యత్నించిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.తాను సీఎంగా ఉన్న సమయంలో జరిగిన దాడులను చంద్రబాబు గుర్తుంచుకొంటే మంచిదన్నారు. ప్రజాస్వామ్య పరిరక్షణ పేరుతో ఉమ్మడి ఉద్యమం చేసే అంశంపై మీడియా తమ పార్టీని తొందరపడి ప్రశ్నించాల్సిన అవసరం లేదని సోము వీర్రాజు చెప్పారు.తమ మిత్రపక్షంగా ఉన్న జనసేన నేత పవన్ కళ్యాణ్ ను చంద్రబాబునాయుడు కలిసి సంఘీభావం తెలపడాన్ని స్వాగతిస్తున్నట్టుగా చెప్పారు.పవన్ కళ్యాణ్ ను చంద్రబాబు బాబు కలిస్తే కంగారు పడాల్సిన అవసరం ఏముందని ఆయన మీడియాను ప్రశ్నించారు.
undefined
కన్నా చాలా సీనియర్:సోము వీర్రాజు
రాజకీయాల్లో అన్నీ ఉంటాయని సోము వీర్రాజు చెప్పారు.కన్నా లక్ష్మీనారాయణ వ్యాఖ్యలను కూడా అదే విధంగా చూస్తున్నామన్నారు.
కన్నా లక్ష్మీనారాయణ రాజకీయాల్లో చాలా సీనియర్ నేతగా ఆయన గుర్తు చేశారు .కన్నా లక్ష్మీనారాయణ చేసిన ఆరోపణలపై బాధ్యత గల వ్యక్తిగా తాను స్పందించనన్నారు. అన్ని పరిణామాలు అధిష్టానం దృష్టిలో ఉన్నాయని సోము వీర్రాజు తెలిపారు.
కన్నా వ్యాఖ్యల కలకలం
రెండు రోజుల క్రితం జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ బీజేపీపై కీలక వ్యాఖ్యలు చేశారు. మోడీ అంటే తనకు గౌరవం ఉందన్నారు. కానీ తాను ఆ పార్టీకి ఊడిగం చేయలేనని వ్యాఖ్యానించారు. తమ రాజకీయ వ్యూహం కూడా మార్చుకొంటామని తేల్చి చెప్పారు. ఈ వ్యాఖ్యలపై ఏపీ రాజకీయాల్లో చర్చు సాగుతుంది. ఈ వ్యాఖ్యలకు బలం చేకూరేలా బీజేపీ ఏపీ మాజీ అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ కూడా తీవ్ర వ్యాఖ్యలు చేశారు. పవన్ కళ్యాణ్ తో సమన్వయం చేసుకోవడంలో బీజేపీ రాష్ట్ర నాయకత్వం వైఫల్యం చెందిందన్నారు .బీజేపీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజుపై విమర్శలు చేశారు. అన్నీ తానే చేయాలననే వీర్రాజు వైఖరి వల్లే ఈ పరిస్థితి నెలకొందన్నారు. ఈ వ్యాఖ్యలు చేసిన కన్నా లక్ష్మీనారాయణ నిన్న సాయంత్రం తన అనుచరులతో భేటీ అయ్యారు. కన్నా లక్ష్మీనారాయణ పార్టీ మారుతారనే ప్రచారం సాగుతుంది. ఈ విషయమై కన్నా లక్ష్మీనారాయణ ఇంకా స్పష్టత ఇవ్వలేదు.
also read:కన్నా బీజేపీని వీడుతారా... వీర్రాజుపై ఆ మాటల వెనుక, అనుచరులతో కీలక భేటీ దేనికి..?
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2024లో ఎన్నికలు జరగనున్నాయి. అయితే ఎన్నికలకు ఇంకా సమయం ఉన్నప్పటికీ రాష్ట్రంలో రాజకీయ పరిణామాల్లో వేగంగా మార్పులు జరుగుతున్నాయి. ఈ పరిణామాలను బీజేపీ ఏపీ చీఫ్ సోము వీర్రాజు నిన్న పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లారు. బీజేపీ నాయకత్వంపై పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు జనసేనాని అసంతృప్తిని బయటపెడుతున్నాయని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. జనసేనాని అసంతృప్తిని చల్లార్చేందుకు కమల దళం ఎలంటి చర్యలు తీసుకొంటుందో చూడాలి.