వైజాగ్ ఎయిర్‌పోర్ట్ కంటే గొప్పగా భోగాపురం విమానాశ్రయ నిర్మాణం... విశేషాలివే

By Galam Venkata Rao  |  First Published Jul 9, 2024, 8:24 PM IST

ప్ర‌స్తుత విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 28 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నారు. 2026 నాటికి కొత్త‌గా ప్రారంభించే భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ప్రారంభంలోనే 50 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు.


ఉత్త‌రాంధ్ర జిల్లాల‌ అభివృద్ధిలో ఎంతో కీల‌క‌మైన, ఈ ప్రాంతానికి గుండెకాయలాంటి భోగాపురం అంత‌ర్జాతీయ గ్రీన్‌ఫీల్డ్ ఎయిర్‌పోర్టు నిర్మాణాన్ని 2026 నాటికి ఎట్టి ప‌రిస్థితుల్లోనూ పూర్తిచేయాల‌ని కేంద్ర పౌర‌విమాన‌యాన శాఖ మంత్రి కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు నిర్వ‌హ‌ణ సంస్థ జీఎంఆర్‌ సంస్థ ప్ర‌తినిధుల‌కు స్పష్టం చేశారు. శ‌ర‌వేగంగా ఎయిర్‌పోర్టు నిర్మాణం ప‌నులు పూర్తిచేయాల‌ని సూచించారు. ఎయిర్‌పోర్టు నిర్మాణానికి కేంద్ర ప్ర‌భుత్వ శాఖ‌ల ద్వారా అవ‌స‌ర‌మైన అనుమ‌తుల‌న్నీ స‌త్వ‌ర‌మే మంజూరుచేసి పూర్తి స‌హ‌కారాన్ని అంద‌జేస్తామ‌ని తెలిపారు. నిర్ణీత కాలవ్య‌వ‌ధిలో ఈ విమానాశ్ర‌య ప‌నుల‌ను పూర్తిచేసేందుకు అత్య‌ధిక ప్రాధాన్యం ఇస్తున్న‌ట్టు చెప్పారు. డిసెంబ‌రు 2026 నాటికి పూర్తిచేయాల్సి ఉండ‌గా.. గ‌డువు కంటే 6 నెల‌ల ముందుగా పూర్తిచేయాల‌ని జీఎంఆర్‌.సంస్థ‌ను కోరారు.
 
ప్ర‌స్తుత విశాఖ ఎయిర్‌పోర్టు ద్వారా ఏడాదికి 28 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తున్నారు. 2026 నాటికి కొత్త‌గా ప్రారంభించే భోగాపురం ఎయిర్‌పోర్టు ద్వారా ప్రారంభంలోనే 50 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణిస్తార‌ని అంచ‌నా వేస్తున్న‌ట్టు కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు తెలిపారు. ఈ విమానాశ్ర‌యాన్ని 60 ల‌క్ష‌ల మంది ప్ర‌యాణించే సామ‌ర్థ్యంతో నిర్మిస్తున్నామ‌ని చెప్పారు. ప్ర‌యాణికుల‌తో పాటు 50 వేల ట‌న్నుల కార్గో హ్యాండ్లింగ్ చేసే విధంగా కార్గో టెర్మిన‌ల్ కూడా నిర్మిస్తున్న‌ట్టు తెలిపారు. ఎయిర్‌పోర్టుతో పాటు ఎంఆర్‌ఓ (మెయింటెనెన్స్‌, రిపెయిర్‌, ఓవర్‌హాల్‌) విభాగం కూడా ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. దేశంలోనే నెంబ‌ర్‌వ‌న్ ఎయిర్‌పోర్టుగా భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని రూపొందించే దిశ‌గా కృషిచేస్తున్నామ‌ని మంత్రి పేర్కొన్నారు. ఈ ఎయిర్‌పోర్టును స‌మీప ప్రాంతాల నుంచి అనుసంధానం చేసి త్వ‌ర‌గా, సుల‌భంగా చేరుకునే విధంగా క‌నెక్టివిటీ రోడ్ల‌ను కూడా నిర్మించ‌నున్న‌ట్టు తెలిపారు.

కేంద్ర పౌర‌విమాన‌యాన మంత్రిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం తొలిసారి భోగాపురం అంత‌ర్జాతీయ విమానాశ్ర‌యాన్ని సంద‌ర్శించారు కింజ‌రాపు రామ్మోహ‌న్ నాయుడు. ఈ సందర్భంగా ఆయనకు ఎయిర్ పోర్టు ట్రంపెట్ వ‌ద్ద స్థానిక నాయ‌కులు, ప్ర‌జాప్ర‌తినిధులు, జిల్లా అధికారులు, జీఎంఆర్‌ సంస్థ ప్ర‌తినిధులు ఘ‌న‌ స్వాగ‌తం ప‌లికారు. అనంత‌రం విజ‌య‌న‌గ‌రం ఎంపీ క‌లిశెట్టి అప్ప‌ల‌నాయుడు, నెల్లిమ‌ర్ల ఎమ్మెల్యే లోకం నాగ‌మాధ‌వి, విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే పూస‌పాటి అదితి గ‌జ‌ప‌తిరాజు, జిల్లా క‌లెక్ట‌ర్ డా.బి.ఆర్‌.అంబేద్క‌ర్‌, జాయింట్ క‌లెక్ట‌ర్ కె.కార్తీక్‌ల‌తో క‌ల‌సి కేంద్ర మంత్రి విమానాశ్ర‌య నిర్మాణం ప‌నుల‌ను ప‌రిశీలించారు.

Latest Videos


ముందుగా ట్రంపెట్ నిర్మాణం, జాతీయ ర‌హ‌దారి నుంచి ఎయిర్‌పోర్టు అనుసంధాన రోడ్డు నిర్మాణం గురించి అందుకు అవ‌స‌ర‌మైన భూసేక‌ర‌ణ‌పై జిల్లా క‌లెక్ట‌ర్ డాక్టర్‌ అంబేద్క‌ర్‌, జాతీయ ర‌హ‌దారుల సంస్థ అధికారులు కేంద్ర మంత్రికి వివ‌రించారు. అనంత‌రం ఎయిర్‌పోర్టు టెర్మిన‌ల్ భ‌వ‌నం నిర్మాణం ప‌నుల‌ను ప‌రిశీలించారు. నిర్మాణం ప‌నుల‌పై ఏర్పాటు చేసిన ప్ర‌జంటేష‌న్, ర‌న్‌వే ప‌నుల‌ను కూడా కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్‌ నాయుడు ప‌రిశీలించారు.

click me!