ఏకంగా రూ.400 కోట్ల లావాదేవీలే..! విశాఖలో ఇంటర్నేషనల్ బెట్టింగ్ ముఠా గుట్టురట్టు (వీడియో)

By Arun Kumar P  |  First Published Sep 29, 2023, 1:51 PM IST

ఆంధ్ర ప్రదేశ్ లో భారీ బెట్టింగ్ ముఠాా పట్టుబడింది. విశాఖపట్నంలో బయటపడ్డ ఈ బెట్టింగ్ వ్యవహారంలో ఏకంగా రూ.400 కోట్ల లావాదేవీలు జరిగినట్లు పోలీసులు తెలిపారు. 


విశాఖపట్నం : యువకుల జీవితాలతో ఆడుకుంటున్న బెట్టింగ్ ముఠాలపై విశాఖ పొలీసులు  ఉక్కుపాదం మోపారు. యువతను టార్గెట్ గా చేసుకుని ఆన్ లైన్ బెట్టింగ్ నిర్వహిస్తూ కోట్ల రూపాయలు కొల్లగొడుతున్నాయి ఈ బెట్టింగ్ ముఠాలు. ఇలా ఏకంగా రూ.400 కోట్ల లావాదేవీలు జరిపిన అంతర్జాతీయ బెట్టింగ్ ముఠాను అత్యంత చాకచక్యంగా వలపన్ని పట్టుకున్నారు విశాఖ పోలీసులు. 11మంది బెట్టింగ్ ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు... మరికొందరి కోసం గాలింపు కొనసాగిస్తున్నట్లు విశాఖ డిసిపి కంచి శ్రీనివాసరావు తెలిపారు. విశాఖ పోలీస్ కమీషనర్ రవిశంకర్ అయ్యనార్ ఆదేశాల మేరకు ఈ బెట్టింగ్ వ్యవహారంపై లోతుగా దర్యాప్తు చేపట్టినట్లు డిసిపి వెల్లడించారు. 

విశాఖ డిసిపి తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఇటీవల నిర్వహించిన స్పందన కార్యక్రమంలో తాను బెట్టింగ్ లో మోసపోయినట్లు ఎర్ర సత్తిబాబు అనే వ్యక్తి పిటిషన్ ఇచ్చాడు. ఈ బెట్టింగ్ వ్యవహారాన్ని సీరియస్ గా తీసుకున్న సిపి రవిశంకర్ దర్యాప్తుకు ఆదేశించారు. బాధితుడు సత్తిబాబు బ్యాంక్ అకౌంట్స్ లావాదేవీల ఆధారంగా ఈ డబ్బులు ఏ ఖాతాలోకి వెళ్లాయో గుర్తించారు. సూరిబాబు అనే బుకీ ఖాతాకు సత్తిబాబు ఎనిమిది లక్షల రూపాయలు పంపించినట్లు తేలింది. సూరిబాబు బ్యాంక్ అకౌంట్ నుండి డబ్బులు ఎవరికి వెళుతున్నాయో లోతుగా దర్యాప్తు చేపట్టగా ఈ బెట్టింగ్ ముఠాలో అసలు సూత్రదారుల వివరాలు బయటపడినట్లు డిసిపి తెలిపారు. 

Latest Videos

undefined

వీడియో

ఆన్ లైన్ బెట్టింగ్ యాప్స్ ద్వారా మోసాలకు పాల్పడున్న 11మంది ముఠా సభ్యులను అరెస్ట్ చేసినట్లు డిసిపి తెలిపారు. ఈ ముఠాలో ప్రధాన నిందితులు దినేష్ అలియాస్ మోను,వాసుదేవరావు అని...మరొకరిని అరెస్ట్ చేయాల్సి వుందని తెలిపారు. వీరు కరెంట్ అకౌంట్స్ తో పాటు ఫేక్ అకౌంట్స్ ఉపయోగించి డబ్బులను కొల్లగొడుతోందని డిసిపి వెల్లడించారు. ఇలా ఈ బెట్టింగ్ ముఠా 63 బ్యాంక్ అకౌంట్స్ ఉపయోగించారని... వీటి ద్వారా రూ.367 కోట్ల లావాదేవీలు జరిపినట్లు గుర్తించామన్నారు. 32 అకౌంట్స్ లో ఇంకో రూ. 75లక్షలు వుండటంతో ఆయా బ్యాంకులను సంప్రదించి అకౌంట్స్ ఫ్రీజ్ చేయించినట్లు డిసిసి వెల్లడించారు. 

Read More  యూట్యూబ్ వీడియో కోసం వన్యప్రాణిని చంపిన ముగ్గురు: అరెస్ట్ చేసిన అనంతపురం పోలీసులు

ఈ బెట్టింగ్ ముఠాలో అనకాపల్లి జిల్లాకు చెందిన సూరిబాబు కీలకంగా వ్యవహరించేవాడని పోలీసులు గుర్తించారు. మొదట వివిధ ఆన్ లైన్ యాప్స్ లో బెట్టింగ్ పెట్టడం ప్రారంభించిన సూరిబాబు కొద్దిరోజులకే బుకీగా మారిపోయాడు. అంతర్జాతీయ క్రికెట్ మ్యాచులు, ఐపీఎల్ సమయంలో బెట్టింగ్ నిర్వహించేవాడు. ఒక్కో మ్యాచ్ కు 20 నుండి 30 మందితో బెట్టింగ్ ఆడిస్తూ నాలుగైదు లక్షలు జమచేసేవాడు. ఇలా ఏడాదికి ఎంతలేదన్నా రూ.5 నుండి 6 కోట్ల లావాదేవీలు జరిపేవాడు. ఈ బెట్టింగ్ డబ్బులను ఎవరికీ అనుమానం రాకుండా ఓ టూర్స్ ఆండ్ ట్రావెల్స్ యజమాని దినేష్ కు పంపించేవాడు. ఈ బెట్టింగ్ వ్యవహారం కొన్నేళ్లుగా కొనసాగుతుండగా తాజాగా బయటపడింది. 

ఈ బెట్టిగ్ ముఠా వెనక ఇంకా ఎవరున్నారో తెలుసుకునేందుకు దర్యాప్తు కొనసాగిస్తున్నట్లు డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. ఇప్పటికే పట్టుబడిన 11మంది అకౌంట్స్ నుండి ఇంకా ఎవరెవరికి ఖాతాల్లోకి డబ్బలు వెళ్లాయో తెలుసుకుంటున్నామని తెలిపారు. అలాగే వారి సెల్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకుని అందులోని వివరాలను సేకరిస్తున్నామని అన్నారు. ఈ బెట్టింగ్ రాకెట్ వెనక వున్న ప్రధాన ముద్దాయిల కోసం గాలిస్తున్నట్టు విశాఖపట్నం డిసిపి శ్రీనివాసరావు తెలిపారు. 


 

click me!