చంద్రన్న కానుకలకు బూజు

First Published Jan 10, 2018, 12:59 PM IST
Highlights
  • చంద్రన్న కానుకలపై రోజురోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి.

చంద్రన్న కానుకలపై రోజురోజుకు ఆరోపణలు పెరిగిపోతున్నాయి. కారణమేంటంటే పంపిణీ అవుతున్న నిత్యావసరాల్లో అత్యధికం పాచిపోయినవే ఉంటున్నాయి. పోయిన సారి పంపిణీ చేసిన వస్తువులపై రాష్ట్రమంతటా పెద్ద గోలే జరిగింది. కృష్ణా, గూంటూరు, అనంతపురం జిల్లాల్లో ఏకంగా కలెక్టర్లే పంపిణీ చేసిన వస్తువులను వాపసు తీసుకున్నారు. ఆమధ్య గుంటూరులో పంపిణీ చేసిన వస్తువులపై మంత్రి పత్తిపాటి పుల్లారావే తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన సంగతి అందరికీ తెలిసిందే.

తాజాగా మరోసారి చంద్రన్న కానుకల పంపిణీ వివాదాల్లోకి ఎక్కింది. సంక్రాంతి సందర్భంగా తెల్ల రేషన్ కార్డుదారులకు నిత్యావసరాలను పంపిణీ చేస్తున్నారు. ఆ వస్తువుల నాణ్యత ఏమంత బావో లేదనr వస్తువులు తీసుకుంటున్న వారి అభిప్రాయం. అందులో కూడా బెల్లం సంగతి అయితే చెప్పక్కనే అక్కర్లేదు. పూర్తిగా చెడిపోయిన బెల్లమే అధికారులు పంపిణీ చేస్తున్నారు. దాంతో రాష్ట్రంలో చాలా చోట్ల తీవ్ర నిరసనలు వ్యక్తమవుతున్నాయి.

అందుకు ఉదాహరణగా కర్నూలు జిల్లాను తీసుకోవచ్చు. జిల్లాలోని ఓర్వకల్లులో బూజుపట్టిన బెల్లం కార్డుదారులకు కానుకగా పంపిణీ అవుతోంది. ‘ఉచితంగా వస్తున్నాయి కదా మాట్లాడకుండా తీసుకెళ్లండి’ అంటూ డీలర్ల దబాయిస్తుండటంతో చేసేదేమి లేక కార్డుదారులు వస్తువులను తీసుకుని వెళ్ళిపోతున్నారు. చాలా చోట్ల ‘ఈ కానుకలను పశువులు తప్ప మనుషులు తినరు’ అంటూ కార్డుదారులు మండిపోతున్నారు.

ఒక కిలో గోధుమపిండి, అరకిలో కందిపప్పు, అర కిలో శనగపప్పు, అరలీటరు పామోలిన్‌, అరకిలో బెల్లం, 100 మిల్లీలీటర్ల నెయ్యి ఇవ్వాలి. జిల్లాలోని ప్రతి చౌకదుకాణానికి సరుకులు పూర్తి స్థాయిలో చేరుకున్నాయి. పంపిణీ కూడా ప్రారంభమైంది. పంపిణీ అవుతున్న ఆరు వస్తువుల్లో ఐదు వస్తువులు నాణ్యత పర్వాలేదు.

చంద్రన్న సంక్రాంతి కానుకల పంపిణీలో జిల్లా చివరి స్థానంలో ఉంది. ఈ జిల్లా నుండి ఉపముఖ్యమంత్రి కెఇ కృష్ణమూర్తి, పర్యాటక శాఖ మంత్రి భూమా అఖిలప్రియ ఉండి కూడా కానుకల పంపిణీలో ఇంతగా నిర్లక్ష్యం కనబడుతోంది. జిల్లాలో 11,82,662 మంది కార్డుదారుల్లో మంగళవారానికి 7, 12, 290 మంది కార్డుదారులు కానుకలను తీసుకున్నారు. కానుకల సరఫరాలో జిల్లా చివరి స్ధానంలో నిలిచింది.

 

click me!