గుంటూరు ఎంపి అభ్యర్ధి శ్రీకృష్ణే....ఖాయం చేసిన జగన్

First Published Jan 10, 2018, 11:40 AM IST
Highlights
  • వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు.

వచ్చే ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్ధులపై వైసిపి అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి ఒక్కొక్కరికి క్లారిటీ ఇచ్చేస్తున్నారు. ప్రస్తుతమున్న 44 మంది ఎంఎల్ఏల్లో ఎంతమందికి మళ్ళీ టిక్కెట్లు వస్తాయన్న విషయాన్ని పక్కన పెడితే సమన్వయకర్తలుగా ఉన్న వారిలో కొందరికి ఇప్పటికే కన్షర్మ్ చేసేసారు. అటువంటి వారిలో కర్నూలు జిల్లాలో పత్తికొండ అసెంబ్లీ టిక్కెట్టును శ్రీదేవీరెడ్డికి ప్రకటించిన విషయం తెలిసిందే.

నియోజకవర్గ ఇన్చార్జిగా ఉన్న చెఱుకులపాడు నారాయణరెడ్డి ప్రత్యర్ధుల చేతిలో హత్యకు గురైన సంగతి తెలిసిందే. నారాయణరెడ్డి హత్యకు గురైన దగ్గర నుండి ఆయన భార్య శ్రీదేవే పార్టీ ఇన్చార్జిగా ఉన్నారు. కాబట్టి మొన్నటి పాదయాత్ర సంరద్భంగా జగన్ తొలి టిక్కెట్టును ఆమెకే కేటాయిస్తు బహిరంగంగానే ప్రకటించారు.

అదేవిధంగా చిత్తూరు జిల్లాలో పర్యటిస్తున్న జగన్ కుప్పం నియోజకవర్గంలో రిటైర్డ్ ఐఏఎస్ అధికారి చంద్రమౌళి పోటీ చేస్తున్నట్లు ప్రకటించి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఎందుకంటే, కుప్పం నియోజకవర్గంలో చంద్రబాబునాయుడు ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. చంద్రబాబు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ప్రధాన ప్రతిపక్షం తరపున ఇంతముందుగా టిక్కెట్టు ప్రకటించటమంటే చిన్నవిషయం కాదు.

సరే, ఇక ప్రస్తుత విషయానికి వస్తే గుంటూరు పార్లమెంటు నియోజకవర్గంలో పోటీ చేసే అభ్యర్ధి విషయంలో కూడా జగన్ నిర్ణయానికి వచ్చినట్లు సమాచరం. ఇక్కడి నుండి లావు శ్రీకృష్ణదేవరాయను(విజ్ఞాన్ సంస్ధల యాజమాన్యం) పార్లమెంటు అభ్యర్ధిగా వైసిపి తరపున జగన్ పోటీలోకి దింపుతున్నారు. శ్రీకృష్ణదేవరాయ విషయం ఎప్పటి నుండో ప్రచారంలో ఉంది.

అయితే, రెండు రోజుల క్రితం జగన్ గుంటూరు నేతలను తన వద్దకు ప్రత్యేకంగా పిలిపించుకున్నారు. గుంటూరు పార్లమెంటు పరిధిలో ఉన్న ఇద్దరు ఎంఎల్ఏలు, ఐదుగురు సమన్వయకర్తలతో పాటు శ్రీకృష్ణదేవరాయతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగానే శ్రీకృష్ణకు గుంటూరు ఎంపి టిక్కెట్టు ఖాయం చేసినట్లు సమాచారం.

ఇక జిల్లాలోని రెండో సీటైన నరసరావుపేట పార్లమెంటు స్ధానంలో టిడిపి ఎంల్ఏ మోదుగుల వేణుగోపాలరెడ్డి పోటీ చేస్తారని ప్రచారం జరుగుతోంది. మోదుగుల టిడిపిలో ఇమడలేకపోతున్నది వాస్తవం. ఆ విషయాన్ని స్వయంగా ఆయనే బహిరంగంగా ప్రకటించారు. దాంతో మోదుగుల వైసిపిలోకి వచ్చేస్తారంటూ ప్రచారం ఊపందుకుంది. మోదుగులతో పాటు మాజీ మంత్రి రావెల కిషోర్ బాబు కూడా వైసిపిలో చేరటం ఖాయమనే ప్రచారం జరుగుతోంది. వీరిద్దరి విషయంలో స్పష్టత వచ్చేందుకు కొంత కాలం పడుతుందని వైసిపి వర్గాలంటున్నాయి.  

click me!