డిసెంబర్ 8వ తేదీన విజయవాడలో బీసీల ఆత్మీయ సమ్మేళనం: వైసీపీ బీసీ నేతలు

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 1:51 PM IST
Highlights

విజయవాడలో డిసెంబర్ 8వ తేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ బీసీ మంత్రులు తెలిపారు. 10 వేల మందితో ఈ సమావేశం జరుపుతామని అన్నారు.

విజయవాడలో డిసెంబర్ 8వ తేదీన బీసీల ఆత్మీయ సమ్మేళనం ఏర్పాటు చేయనున్నట్టుగా ఆంధ్రప్రదేశ్‌ బీసీ మంత్రులు తెలిపారు. 10 వేల మందితో ఈ సమావేశం జరుపుతామని అన్నారు. ఈ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్టుగా చెప్పారు. ఈ రోజు తాడేపల్లిలోని ముఖ్యమంత్రి క్యాంపు కార్యాలంలో బీసీ మంత్రులు, వైసీపీ బీసీ నేతల సమావేశం జరిగింది. ఈ సమావేశం అనంతరం బీసీ మంత్రులు మీడియాతో మాట్లాడారు. తమది బీసీల ప్రభుత్వం అని మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ చెప్పారు. విజయవాడలో జరిగే బీసీల ఆత్మీయ సమ్మేళనానికి సీఎం జగన్‌ను ఆహ్వానించనున్నట్టుగా చెప్పారు. మూడున్నరేళ్లలో సీఎం జగన్ బీసీలకు ఎన్నో పథకాలు అందించారని అన్నారు. 

బీసీ డిక్లరేషన్‌లో పొందుపరిచిన ప్రతి అంశాన్ని సీఎం జగన్ అమలు చేస్తున్నారని ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి తెలిపారు. 139 కులాలకు అనేక సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని చెప్పారు. ప్రతి కులానికి ఒక కార్పొరేషన్ ఏర్పాటు చేసిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుందన్నారు. నామినేటెడ్ పదవులు, పనుల్లోనూ 50 శాతం బీసీలకే ఇచ్చారని చెప్పారు. 

ఇక, బీసీల కోసం ప్రభుత్వం చేసిన సంక్షేమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడంపై అనుసరించాల్సిన ప్రణాళికలపై ఈ సమావేశంలో వైసీపీ బీసీ నేతలు చర్చించారు. ఈ సమావేశంలో మంత్రులు బొత్స సత్యనారాయణ, బూడి ముత్యాల నాయుడు, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, జోగి రమేష్, గుమ్మనూరు జయరాం, ఎమ్మెల్సీ జంగా కృష్ణమూర్తి, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్.. తదితరులు హాజరయ్యారు. 

click me!