రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త.. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహం ఆవిష్కరిస్తాం: సీఎం జగన్

By Sumanth KanukulaFirst Published Nov 26, 2022, 1:29 PM IST
Highlights

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారని చెప్పారు.

భారత రాజ్యాంగం ఎంతో గొప్పదని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అన్నారు. 80 దేశాల రాజ్యాంగాలను అధ్యయనం చేసి మన రాజ్యాంగం రూపొందించారని చెప్పారు. రాజ్యాంగం అందరికీ క్రమశిక్షణ నేర్పే రూల్ బుక్ అని చెప్పారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన రాజ్యాంగ దినోత్సవ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్, సీఎం జగన్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి గవర్నర్ బిశ్వభూషణ్, సీఎం జగన్ నివాళులర్పించారు. 

ఆ కార్యక్రమంలో సీఎం జగన్ మాట్లాడుతూ.. రాజ్యాంగమే మన సంఘ సంస్కర్త అని అన్నారు. గ్రామ సచివాలయాల ద్వారా గ్రామ స్వరాజ్యాన్ని సాధించామని చెప్పారు. వచ్చే ఏడాది ఏప్రిల్‌లో విజయవాడలో అంబేద్కర్ విగ్రహాన్ని ఆవిష్కరిస్తామని తెలిపారు. ఆంగ్ల మాధ్యమం వద్దంటూ చేస్తున్న నయా అంటరానితనం నుంచి విద్యార్థులకు సీబీఎస్‌ఈ అమలు చేస్తున్నామన్నారు. 

రాజ్యాంగం అణగారిన వర్గాలకు అండగా నిలిచిందని అన్నారు. గ్రామ సచివాలయాలు, వాలంటీర్ల వ్యవస్థను అమలు చేస్తున్న తొలి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ అని చెప్పారు. నామినేటెడ్ పదవులు, పనుల్లో.. బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనారిటీలో 50 శాతం ఇస్తున్నామని చెప్పారు. మంత్రి మండలిలో 70 శాతం బీసీలు, ఎస్సీలు, ఎస్టీలు, మైనార్టీలేని చెప్పారు. శాసనమండలి చైర్మన్‌గా ఎస్సీని, డిప్యూటీ చైర్మన్‌గా మైనారిటీని నియమించామని తెలిపారు. 

click me!