
మంత్రి గంటా శ్రీనివాస రావు ఆస్తులను ఇండియన్ బ్యాంకు స్వాధీనం చేసుకోవటం రాజకీయ వర్గాల్లో కలకలం రేపుతోంది. వ్యాపారాలు, విస్తరణ పేరుతో బ్యాంకుల నుండి కోట్లాది రూపాయలు రుణాలుగా తీసుకోవటం ఆ తర్వాత ఎగనామమం పెట్టటం పలువురు నేతలకు మామూలైపోయింది.
అప్పు వసూళ్ళకు బ్యాంకులు ప్రయత్నిస్తే అధికార, రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకుని బయటపడటం మనం చూస్తున్నదే.
టిడిపికే చెందిన కేంద్రమంత్రి సుజనా చౌదరి భాగోతం అందరికీ తెలిసిందే. ఇపుడు అదే కోవలో రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాస రావు కూడా చేరారు. కాకపోతే, సుజనా వ్యవహారం న్యాయస్ధానాల్లో నలుగుతోంది. ఇపుడు మరొక టిడిపి మంత్రి ఈ సుజనకు తోడయ్యారు. గంటా ఆస్తులను బ్యాంకు స్వాధీనం చేసేసుకుంది అంతే తేడా. గంటా శ్రీనివాస రావు కూడా సుజనా చౌదరిలాగే, తనకు ఆ కంపెనీకి సంబంధాలు లేవని, తానెప్పుడో తప్పకున్నానని చిలకపలుకులు పలుకుతున్నారు. సుజనా మీద ఎన్నికేసులొచ్చిన చంద్రబాబు నాయుడు ఒక్క మాట కూడా మాట్లాడ లేదు. ఇపుడు గంటా మీద కూడా అలాగే జరుగుతుంది. అయితే, టిడిపికి వీళ్లందరితో అంటుకున్న మరకలుమాత్రం మాసిపోవు.
ఇంతకీ జరిగిందేమిటంటే, గంటా భాగస్వామ్యంలో 2005న విశాఖపట్నంలో ప్రత్యూషా రిసోర్సెస్ అండ్ ఇన్ఫ్రా ప్రైవేటు లిమిటెడ్ సంస్ధ ఇండియన్ బ్యాంకు నుండి రూ. 141 కోట్లు అప్పు తీసుకుంది. ప్రస్తుతానికి ఆ అప్పు రూ. 196 కోట్లకు చేరుకుంది.
షరా మామూలుగానే అప్పటి నుండి ఇప్పటి వరకూ ఒక్క రూపాయి కూడా బకాయి చెల్లించలేదు. ఈ కంపెనీలో మంత్రితో పాటు ఆయన తోడల్లుడు, దగ్గర బంధువులు, మిత్రులు డైరెక్టర్లుగా ఉన్నారు.
మొన్న అక్బోబర్ లో బ్యాంకు అధికారులు డైరెక్టర్లకు నోటీసులు ఇచింది. అధికారం తమ ఇంట్లోనే ఉంది కాబట్టి నోటీసులను ఎవరూ ఖాతరు చేయలేదు. దాంతో ఓపికి చచ్చిపోయిన బ్యాంకు డైరెక్టర్ల ఆస్తుల స్వాధీనానికి ఈనెల 21వ తేదీన ప్రకటన జారీ చేసింది.
అయినా వారు పట్టించుకోకపోవటంతో విశాఖపట్నం, గాజువాక, చినగదిలి, రుషికొండ, మధువాడ, ఆనందపురం, అనకాపల్లి, కాకినాడలోని ప్రత్యూషా కంపెనీ ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. ఇందులో గంటా ఆస్తులు కూడా ఉండటంతో ప్రభుత్వం, పార్టీలో కలకలం రేగుతోంది.
ఇదే విషయమై గంటా మాట్లాడుతూ, కంపెనీలో ఒకపుడు డైరక్టర్ గా ఉన్నమాట వాస్తవమేనన్నారు. ప్రస్తుతం కంపెనీతో తనకు ఎటువంటి సంబంధాలూ లేవని స్పష్టం చేసారు. కంపెనీ తీసుకున్న అప్పులకు తాను హామీదారుగా ఉన్న మాట వాస్తవమేనని అంగీకరించారు.
అయినా కంపెనీ అప్పు పడిన సంగతి, బకాయిలు చెల్లించని సంగతి గంటాకు తెలీకుండానే ఉంటుందా? హామీదారుగా ఉన్నపుడు బ్యాంకులతో వ్యవహారం ఎలాగుంటుందో తెలీని అమాయకుడు కాదు కదా మంత్రి ? అయినా బకాయిలు చెల్లించలేదంటే అర్ధం ఏమిటి ?
బకాయిల చెల్లింపుల విషయంలో డైరక్టర్లతో మాట్లాడుతనని గంటా చెప్పటం గమనార్హం. అడ్డంగా దొరికితే ఒకలా, దొరక్కపోతే ఇంకోలా వ్యవహరించంట చాలా మందికి మామూలైపోయింది.