
కాకినాడ : కొడుకు పుట్టిన ఆనందం ఆ దంపతులకు ఎక్కువకాలం నిలవలేదు. భార్యా బిడ్డను చూసేందుకు అత్తవారింటికి వెళుతున్న ఓ బ్యాంక్ ఉద్యోగి రోడ్డు ప్రమాదానికి బలయ్యాడు. ఈ హృదయవిదారక ఘటన తూర్పు గోదావరి జిల్లాలో చోటుచేసుకుంది.
పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. సీతానగరం జిల్లా బొబ్బిలంకకు చెందిన చిట్టూరి బాపన్న కు ఇద్దరు కొడుకులు. పెద్దవాడు సీతానగరం ఎస్బిఐలో, చిన్నవాడు కాటవరం యూనియన్ బ్యాంక్ లో ఉద్యోగాలు చేస్తున్నారు. ఇద్దరు కొడుకులు బ్యాంక్ ఉద్యోగాలు చేస్తూ సెటిల్ కావడంతో ఆ తండ్రి శేషజీవితాన్ని ఆనందంగా గడుపుతుండగా పెను విషాదం చోటుచేసుకుంది.
రెండేళ్ళ క్రితం బాపన్న పెద్దకొడుకు అజయ్(33) కు పెదపూడి మండలం కడకుదురుకు చెందిన అమ్మాయితో వివాహమైంది. గర్భంధాల్చిన భార్య ప్రసవం కోసం పుట్టింటికి వెళ్లి నాలుగు నెలల క్రితమే పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. ఈ క్రమంలోనే ఆదివారం సెలవురోజు కావడంతో భార్యాబిడ్డను చూసేందుకు అజయ్ అత్తవారింటికి బైక్ పై సీతానగరం నుండి బయలుదేరారు. అయితే అతడు గామన్ బ్రిడ్జిపై వెళుతున్న అతడు ప్రమాదానికి గురయ్యాడు. గుర్తుతెలియని వాహనం వేగంగా దూసుకెళుతూ బైక్ ను ఢీకొట్టింది. దీంతో అమాంతం ఎగిరి రోడ్డుపై పడ్డ అజయ్ తల పైనుండి వాహనం వెళ్లడంతో అక్కడికక్కడే మృతిచెందాడు.
Read More దారుణం.. టిక్కెట్ డబ్బులు ఇవ్వలేదని కదులుతున్న బస్సులో నుంచి తోసేయడంతో యువకుడి మృతి
రక్తపుమడుగులో ఓ వ్యక్తి గామన్ బ్రిడ్జిపై పడివున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. దీంతో ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. మృతదేహం అజయ్ ది గుర్తించి అతడి కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.
అజయ్ మృతివార్త తెలిసి భార్యతో పాటు తల్లిదండ్రులు, సోదరుడు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. మంచి ఉద్యోగం, భార్యా పిల్లలతో హాయిగా జీవిస్తున్న కొడుకు ఇలా హఠాత్తుగా మృతిచెందడంతో ఆ తల్లిదండ్రులను ఓదార్చడం ఎవరివల్లా కావడంలేదు. అందరితో కలుపుగోలుగా వుండే అజయ్ మృతితో సీతానగరంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.