
నందమూరి వారసుడు, నటసింహమైన నందమూరి బాలకృష్ణ, టిడిపి వ్యవస్ధాపక అధ్యక్షుడు, తన తండ్రి ఎన్టీఆర్ పరువును బజారున పడేస్తున్నాడు. టిడిపి నుండి వైసీపీలోకి మారిన శిల్పా సోదరులపై బాలయ్య చేస్తున్న విమర్శలతో అందరూ ఆశ్చర్యపోతున్నారు. అదికూడా ఫిరాయింపు మంత్రులను పక్కనే పెట్టుకుని. శిల్పా సోదరులు స్వార్దంతోనే వైసీపీలోకి మారారట. టిడిపిలో ఉన్నంత కాలం సోదరులిద్దరికీ ఎంఎల్సీ పదవులు, జిల్లా అధ్యక్ష పదవులిచ్చి గౌరవించినట్లు చెప్పారు. అయితే, బాలయ్య మరచిపోయిన విషయం ఒకటుంది.
పార్టీలు మారటమన్నది చాలా సహజం. తమకు ఎక్కడ అవకాశముంటే, భవిష్యత్తు ఏపార్టీలో ఉంటుందనుకుంటే అందులోకి జంప్ చేసేస్తారు. ఆ విషయం బాలయ్యకు తెలీనిదేమీ కాదు. కాకపోతే అప్పటి వరకూ పార్టీలో ఉన్న పదవులకు ఎటూ రాజీనామాలు చేసేస్తారు. ఒకవేళ అధాకారిక పదవులేమన్నా ఉంటే వారికి కూడా రాజీనామాలు చేస్తున్నారా లేదా అన్నది ప్రధానం.
పోయిన ఎన్నికల్లో వైసీపీ తరపున గెలిచిన ఎంఎల్ఏల్లో 21 మందిని చంద్రబాబు టిడిపిలోకి లాక్కున్నారు. పార్టీ మారిన ఎంఎల్ఏలతో రాజీనామా చేయించటమన్నది నైతిక విలువలకు నిదర్శనం. అప్పట్లో టిడిపిని స్ధాపించినపుడు ఎన్టీఆర్ అదే పనిచేసారు. కాంగ్రెస్ నుండి టిడిపిలోకి వస్తామన్న వారితో ఎన్టీఆర్ రాజీనామాలు చేయించిన తర్వాతే పార్టీలోకి తీసుకున్నారు. ఇపుడదే సంప్రదాయాన్ని వైసీపీ అధ్యక్షుడు జగన్ కూడా అనుసరిస్తున్నారు.
కానీ 40 ఇయర్స్ ఇండస్ట్రీ అని, నైతిక విలువలకు తానే నిలువెత్తు సంతకమని రోజుకు వందసార్లు చెప్పుకనే చంద్రబాబునాయుడు మాత్రం నైతిక విలువలకు తవ్వి పాతేసారు. అదే ఒరవడిని బాలయ్య కూడా పాటిస్తున్నారు. బావ కమ్ ముఖ్యమంత్రి చంద్రబాబు చేస్తున్నది తప్పని తెలిసినా బాలయ్య నోరు మెదపటం లేదు. పైగా బుధవారం రోడ్డుషోలో శిల్పా సోదరులను స్వార్ధపరులుగా విమర్శించటం విచిత్రం. టిడిపిలో నుండి వైసీపీలోకి మారగానే చక్రపాణి రెడ్డి ఎంఎల్సీ పదవికి రాజీనామా చేసేసారు కదా? ఇక శిల్పా సోదరుల్లో స్వార్దమేముంది?
పార్టీ మారినా ఎంఎల్ఏ పదవులకు రాజీనామాలు చేయకుండా కొనసాగుతున్న 20 మంది ఫిరాయింపులది స్వార్ధంగా కనబడలేదు బాలయ్యకు. తన బావ చేస్తున్నది తప్పుగా కనబడలేదు. తన తండ్రి పాటించిన నైతిక విలువలను కొనసాగిస్తున్న జగన్ కు పదవులపై వ్యామోహమట. ఫిరాయింపులను నిశిగ్గుగా ప్రోత్సహిస్తున్న చంద్రబాబు మాత్రం ఆదర్శమని బాలకృష్ణ చెబుతున్నారంటే, తండ్రి ఎన్టీఆర్ పరువును బజారున పడేస్తున్నట్లే.