
ఆంధ్రలో ప్రభుత్వం, ప్రధాన ప్రతిపక్షం మోదీతో దోస్తీకి పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. ప్రజల సమస్యలను మరిచి సొంత ప్రయోజనాల కోసం ప్రధానికి దగ్గరవ్వడానికి వాళ్లు ప్రయత్నాలు ప్రారంభించారని ఆయన మండిపడ్డారు.
ఆదివారం ఆయన మీడియా తో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజలు ఎన్నో సమస్యలతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నా తమకి ఏమీ పట్టనట్లు ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆమన ధ్వజమెత్తారు. చంద్ర బాబు తన పార్టీని కాపాడుకొవడానికి చూపిస్తున్న ప్రేమ, రాష్ట్ర ప్రజల అభివృద్దికి చూపడం లేదని ఆయన ఆరోపించారు.
రాష్ట్ర ప్రయోజనాలు మంట కలిపి మోదీకి ఫ్రెండ్ షిప్ బ్యాండ్ కట్టేందుకు ఇరు పార్టీ నేతలు పోటీ పడుతున్నారని ఎద్దేవా చేశారు. దళిత, గిరిజన, మైనార్టీ వర్గాలకు బద్ధ వ్యతిరేకి అయిన మోదీకి సలాం కొడుతున్నారని అన్నారు. జగన్, బాబు తమ ఉనికి కోసం ఒకరి కొకరు దాడులు చేసుకుంటున్నారని ఆయన అన్నారు. గెలుపు కోసం కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని ఆరోపించారు.
నంద్యాల ఉప ఎన్నికలో కాంగ్రెస్ కూడా బరిలోకి దిగుతున్న విషయం తెలిసిందే. నేడు ఆయన నంద్యాల్లో ప్రచారాన్ని ఉద్ధృతం చేశారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు, జగన్ లపై విమర్శలు గుప్పించారు.