భూమా కుటుంబానికి చెక్ : ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు...?

Published : Feb 22, 2019, 08:37 PM IST
భూమా కుటుంబానికి చెక్ : ఏవీ సుబ్బారెడ్డి తిరుగుబాటు...?

సారాంశం

తాను తన మిత్రుడు భూమా నాగిరెడ్డి కోసం ఇన్నాళ్లు పోటీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈసారి పోటీచెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. భూమా కుటుంబంలో రెండు పదవులు ఉన్నాయని ఒకటి తనకు ఇస్తారన్న నమ్మకం ఏపీ సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. 

అమరావతి: ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో కర్నూలు జిల్లా రాజకీయాలు రంజుగా మారుతున్నాయి. కర్నూలు జిల్లా తెలుగుదేశం పార్టీలో అసమ్మతి ఇప్పటికే చోటు చేసుకుంది. ఆ అసమ్మతిని ఎలా అణిచివెయ్యాలా అని ఆలోచిస్తున్న తరుణంలో ఏవీ సుబ్బారెడ్డి రూపంలో మరో చిక్కు వచ్చి పడింది సీఎం చంద్రబాబు నాయుడుకి. 

కర్నూలు జిల్లాలో అభ్యర్థుల ఎంపికకు సంబంధించి సీఎం చంద్రబాబు నాయుడు ఇప్పటికే కసరత్తు ప్రారంభించారు. అందులో భాగంగా శుక్రవారం  ఆయన కర్నూలు జిల్లా నేతలతో సమావేశమయ్యారు. అభ్యర్థుల ఎంపిక, కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబం తెలుగుదేశం పార్టీలో చేరే అంశంపై చర్చించారు. 

ఈ సందర్భంగా టీడీపీ కీలక నేత ఏవీ సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాబోయే ఎన్నికల్లో నంద్యాల లేదా ఆళ్లగడ్డ నుంచి పోటీ చెయ్యాలని భావిస్తున్నట్లు ప్రకటించారు. తనకు నంద్యాల, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బలమైన క్యాడర్ ఉందని చెప్పుకొచ్చారు. 

తాను తన మిత్రుడు భూమా నాగిరెడ్డి కోసం ఇన్నాళ్లు పోటీకి దూరంగా ఉన్నానని చెప్పుకొచ్చారు. ఈసారి పోటీచెయ్యాలని భావిస్తున్నట్లు తెలిపారు. భూమా కుటుంబంలో రెండు పదవులు ఉన్నాయని ఒకటి తనకు ఇస్తారన్న నమ్మకం ఏపీ సీఎం చంద్రబాబుపై ఉందన్నారు. 

నంద్యాల లేదా ఆళ్లగడ్డ ఏ నియోజకవర్గం టికెట్ ఇచ్చినా గెలుస్తానని ధీమా వ్యక్తం చేశారు. అయితే పార్టీ ఏనిర్ణయం తీసుకున్నా కట్టుబడి ఉంటానని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు. కర్నూలు జిల్లాలో నెలకొన్న అసమ్మతి సెగను ఎలా ఆర్పాలా అని ఆలోచిస్తున్న చంద్రబాబుకు ఏవీ సుబ్బారెడ్డి చేసిన వ్యాఖ్యలు మింగుడు పడటం లేదట. 

ఇకపోతే ఆళ్లగడ్డ నియోజకవర్గం నుంచి మంత్రి భూమా అఖిలప్రియ ప్రాతినిథ్యం వహిస్తుండగా, నంద్యాల నియోజకవర్గం నుంచి భూమా బ్రహ్మానందరెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. భూమా నాగిరెడ్డి మరణానంతరం జరిగిన ఉపఎన్నికల్లో భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. దీంతో భూమా కుటుంబం నుంచి ఇద్దరికి ఎమ్మెల్యే పదవులు వరించాయి. అయితే ఒకే కుటుంబానికి ఒకే పదవి అన్న నినాదాన్ని తెరపైకి తెస్తున్నారు ఏవీ సుబ్బారెడ్డి. 
    
 

PREV
click me!

Recommended Stories

Andhra pradesh: ఎట్ట‌కేల‌కు ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో హైటెక్ సిటీ.. క్యూ క‌డుతోన్న సాఫ్ట్‌వేర్ కంపెనీలు, వేలల్లో ఉద్యోగాలు
IMD Rain Alert : తెలుగు రాష్ట్రాలకు మరో తుపాను గండం .. ఈ ప్రాంతాల్లో చల్లని వర్షాలు