గతంలోనే వైసీపీలో చేరాలనుకున్న గంటా శ్రీనివాస్, గంటా మోసకారి: అవంతి శ్రీనివాస్

By Nagaraju penumalaFirst Published Feb 22, 2019, 7:47 PM IST
Highlights


తనకంటే ముందే మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గతంలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించిన గంటా శ్రీనివాసరావు తనను విమర్శించడం సిగ్గు చేటన్నారు. 

విశాఖపట్నం: నమ్మిన వారిని మోసం చెయ్యడంలో మంత్రి గంటా శ్రీనివాసరావు తర్వాతే ఎవరైనా అని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ సంచలన వ్యాఖ్యలు చేశారు. తనను తనతోపాటు మరో నలుగురిని వెంటబెట్టుకుని చంద్రబాబు నాయుడు దగ్గరకు తీసుకెళ్లిన వ్యక్తి గంటా శ్రీనివాసరావు అని చెప్పుకొచ్చారు. 

తాను టీడీపీలో చేరతానని చెప్పలేదని తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరదామని అనుకుంటే గంటా శ్రీనివాసరావు చంద్రబాబు నాయుడు అనుభవజ్ఞుడు అందరికీ టికెట్లు ఇప్పిస్తానంటూ తీసుకెళ్లి ఇద్దరికి ఇప్పించి ముగ్గురికి హ్యాండ్ ఇచ్చారంటూ ఆరోపించారు. 

తాను భీమిలి నియోజకవర్గం టికెట్ అడిగితే అనకాపల్లి ఎంపీగా పోటీ చెయ్యాలని పంపించేశారని చెప్పుకొచ్చారు. ఐదేళ్లలో మంత్రి గంటా మోసాలు అంతా చూశారని గుర్తు చేశారు. ప్రజలకు సేవ చెయ్యాలన్న ఉద్దేశంతోనే తాను రాజకీయాల్లోకి వచ్చానని గంటా శ్రీనివాసరావులా రాలేదన్నారు. 

ఎమ్మెల్యే పదవికోసమో, మంత్రి పదవికోసమో తాను వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరలేదని అనకాపల్లి ఎంపీ అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. డబ్బుతో గెలవాలని లేని పక్షంలో బెదిరించో ఓట్లు వేయించుకుని గెలవాలన్న ఆలోచనలో గంటా శ్రీనివాసరావు ఉన్నారని ఆరోపించారు. 

తనకంటే ముందే మంత్రి గంటా శ్రీనివాసరావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరాలని ప్రయత్నించారని అవంతి శ్రీనివాస్ స్పష్టం చేశారు. గతంలో వైసీపీలో చేరేందుకు ప్రయత్నించిన గంటా శ్రీనివాసరావు తనను విమర్శించడం సిగ్గు చేటన్నారు. 

వైఎస్ జగన్మోహన్ రెడ్డితోనే ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యమన్నారు. ఆనాడు కేంద్రమంత్రిగా అవకాశం ఇస్తామని కాంగ్రెస్ పార్టీ ఆహ్వానించిన దాన్ని తృణప్రాయంగా వదిలేసిన వ్యక్తి వైఎస్ జగన్ అని చెప్పుకొచ్చారు. ఇచ్చిన మాట కోసం కేంద్రాన్ని ఎదిరించారని తెలిపారు. 

కాంగ్రెస్ పార్టీకి ఎదురు తిరగడం వల్లే వైఎస్ జగన్ పై తప్పుడు కేసులు పెట్టారంటూ ధ్వజమెత్తారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ ప్రభుత్వ హయాంలో అన్ని నియోజకవర్గాల్లో అవినీతి పేరుకుపోయిందని ఆరోపించారు. 

సాయం చేస్తుందని చెప్తూ బీజేపీకి మద్దతు పలికిన చంద్రబాబు కేంద్ర కేబినెట్ లో రెండు మంత్రి పదవులు పొంది ఎన్నికల సమయానికి ఎన్డీఏకు గుడ్ బై అంటూ చంద్రబాబు చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు ఎంపీ అవంతి శ్రీనివాసరావు. 

click me!