చేసేది అటెండర్ ఉద్యోగం.. కూడపెట్టిన ఆస్తులు రూ.100కోట్లు

First Published May 2, 2018, 10:52 AM IST
Highlights

ఏసీబీకి చిక్కిన మరో భారీ తిమింగళం

ఓ ప్రభుత్వ సంస్థలో అటెండర్ కి జీతం ఎంత వస్తుంది..? రూ.20 వేలు మహా అంటే రూ.30వేలు. అడపాదడపా వచ్చే పదోన్నతల కారణంగా మరో పదో పరకో వస్తాయి. అలాంటిది ఓ అటెండర్ మాత్రం ఒకటి కాదు, రెండు కాదు.. ఏకంగా రూ.100కోట్లు కూడబెట్టాడు. చివరికి అవినీతి నిరోధక శాఖకు  అడ్డంగా దొరికిపోయాడు.

పూర్తి వివరాల్లోకి వెళితే... ఏసీబీ సెంట్రల్‌ ఇన్వెస్టిగేషన్‌ యూనిట్‌ డీఎస్పీ ఎ.రమాదేవి ఆధ్వర్యంలో నెల్లూరు, కడప, తిరుపతి, విజయవాడ ఏసీబీ అధికారులు మంగళవారం ఉదయం నెల్లూరు ఎంవీ అగ్రహారంలోని నరసింహారెడ్డి ఇంటితో పాటు కాపువీధిలోని నరసింహారెడ్డి సోదరుడు నరహరిరెడ్డి, పుత్తా ఎస్టేట్‌లోని మరో సోదరుడు నిరంజన్‌రెడ్డి, రాంజీనగర్‌లోని అతని మామ మురళీమోహన్‌రెడ్డి, ఆత్మకూరులోని బావమరిది వరప్రసాద్‌రెడ్డి, ఏజెంట్‌ బి.ప్రసాద్‌ ఇళ్లలో ఏకకాలంలో సోదాలు నిర్వహించారు.

అనంతరం ఏబీసీ అధికారులు డీటీసీ కార్యాలయంలోనూ తనిఖీలు నిర్వహించి పలు కీలక పత్రాలను స్వాధీనం చేసుకున్నారు. ఏసీబీ అధికారుల సమాచారం మేరకు.. నెల్లూరు కాపువీధి (ప్రస్తుతం ఎంవీ అగ్రహారం భార్గవినగర్‌)కి చెందిన కరాదు నరసింహారెడ్డి 1984లో రవాణాశాఖలో అటెండర్‌ (ఆఫీసు సబార్డినేటర్‌)గా విధుల్లో చేరారు. ప్రస్తుతం నెల్లూరు డిప్యూటీ ట్రాన్స్‌పోర్ట్‌ కమిషనర్‌ కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్నారు.

విధుల్లో చేరిన నాటినుంచి ఉన్నతాధికారులకు అన్నీ తానై వ్యవహరిస్తున్నారు. ఈ క్రమంలో అతనికి ఉద్యోగోన్నతి లభించినా.. వద్దని 34 ఏళ్లుగా ఆఫీసు సబార్డినేటర్‌గానే విధుల్లో కొనసాగుతున్నాడు. అక్రమ సంపాదనతో తనపేరున, తన భార్య, బంధువుల పేర్లపై పెద్ద ఎత్తున ఇళ్ల స్థలాలు, భూములు, బంగారు, వెండి ఆభరణాలు కొనుగోలు చేశారు.  

ఏసీబీ అధికారుల సోదాల్లో నరసింహారెడ్డి, అతని భార్య హరిప్రియ పేరుపై 18 ఇళ్లస్థలాలు, ఎంవీ అగ్రహారంలో జీప్లస్‌–2 ఇళ్లు, నరసింహారెడ్డి పేరుపై నెల్లూరు రూరల్‌ మండలం గుండ్లపాళెంలో 3.95 ఎకరాల వ్యవసాయ భూమి, అతని భార్య పేరుపై గుండ్లపాళెంలో 12.39 ఎకరాలు, సంగం మండలం పెరమనలో 35ఎకరాల వ్యవసాయభూమి, నరసింహారెడ్డి అత్త నారాయణమ్మ పేరుపై కొంత భూమికి సంబంధించి (మొత్తం 50.36 ఎకరాల వ్యవసాయ భూమి) డాక్యుమెంట్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

రెండు కిలోల బంగారు, 7.5 కిలోల వెండి ఆభరణాలు, రూ.7.75 లక్షల నగదు, రూ.1.01కోట్ల ఎల్‌ఐసీ డిపాజిట్లకు చెందిన బాండ్లు, రూ.10లక్షలు ఎల్‌ఐసీ పాలసీలను ఏసీబీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.బ్యాంక్‌లో రూ.20 లక్షల నగదు, రూ.5లక్షలు విలువ చేసే గృహోపకరణాలు, రెండు యూనికాన్‌ బైక్‌లను గుర్తించారు.

ఇప్పటి వరకు స్వాధీనం చేసుకున్న ఆస్తుల విలువ ప్రభుత్వ ధర ప్రకారం రూ.10 కోట్లు ఉండగా బహిరంగ మార్కెట్‌లో రూ.100కోట్లు ఉండవచ్చని అధికారులు అంచనా వేస్తున్నారు. కాగా కో–ఆపరేటివ్‌ బ్యాంక్‌లో నరసింహారెడ్డి అతడి భార్య, కుమార్తె పేర్లపై రెండు లాకర్లు ఉన్నాయి. వాటిల్లో భారీగా బంగారు ఆభరణాలు ఉన్నట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు.
 

click me!