ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా అచ్చెన్నాయుడు: ఖరారు చేసిన చంద్రబాబు

By telugu teamFirst Published Sep 22, 2020, 12:55 PM IST
Highlights

బీసీల నుంచి బలంగా గొంతు వినిపిస్తున్న సీనియర్ ఎమ్మెల్యే అచ్చెన్నాయుడిని టీడీపీ ఏపీ శాాఖ అధ్యక్షుడిగా నియమించినట్లు తెలుస్తోంది. అచ్చెన్న పేరును చంద్రబాబు ఈ నెల 27వ తేదీన ప్రకటించే అవకాశం ఉంది.

అమరావతి: ఆంధ్రప్రదేశ్ తెలుగుదేశం పార్టీ (టీడీపీ) అధ్యక్షుడిగా కె. అచ్చెన్నాయుడి పేరు ఖరారైంది. ఏపీ టీడీపీ అధ్యక్షుడిగా ఆయన పేరును ప్రకటించడం లాంఛనమేనని అంటున్నారు. ఈ నెల 27వ తేదీన టీడీపీ జాతీయాధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు ఆ మేరకు ప్రకటన చేసే అవకాశం ఉంది. 

కళా వెంకటరావు స్థానంలో అచ్చెన్నాయుడు టీడీపీ ఆంధ్రప్రదేశ్ శాఖ పగ్గాలు చేపడుతున్నారు. బీసీ నేత కావడం ఆయనకు కలిసి వచ్చిన అంశంగా భావిస్తున్నారు. అంతేకాకుండా ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ప్రభుత్వానికి, వైసీపీకి వ్యతిరేకంగా ఆయన బలంగా గొంతు వినిపిస్తున్నారు. 

ఏపీ టీడీపీ కొత్త కమిటీపై కసరత్తు పూర్తయినట్లు తెలుస్తోంది. ఈఎస్ఐ కుంభకోణం కేసులో అచ్చెన్నాయుడు అరెస్టయి బెయిల్ మీద విడుదలైన విషయం తెలిసిందే. దాదాపు 70 రోజుల పాటు ఆయన జైలులో ఉన్నారు. తనను కేసులో అక్రమంగా ఇరికించారని, ప్రజల తరఫున గట్టిగా గొంతు విప్పుతున్నందుకే తనపై కేసులు బనాయించారని అచ్చెన్నాయుడు అంటున్నారు. 

అచ్చెన్నాయుడు టీడీపీకి ఎదురు గాలి వీచిన స్థితిలో కూడా శాసనసభ ఎన్నికల్లో విజయం సాధించారు. వైసీపీ ప్రభుత్వాన్ని అచ్చెన్నాయుడు బలంగా ఎదుర్కోగలరని చంద్రబాబు భావిస్తున్నట్లు సమాచారం.

click me!