పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాల్లో టీడీపీ జోరు.. అచ్చెన్నాయుడు స్పందన ఇదే

By Siva KodatiFirst Published Mar 17, 2023, 6:02 PM IST
Highlights

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి ఆధిక్యంలో వుండటంతో ఆ పార్టీ  ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే..  జగన్‌కు కర్రు కాల్చి వాత పెట్టిన విధంగా వున్నాయన్నారు.

ఉత్తరాంధ్ర పట్టభద్రుల స్థానం ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ అభ్యర్ధి వేపాడ చిరంజీవి ఆధిక్యంలో వుండటంతో ఆ పార్టీ శ్రేణులు రాష్ట్ర వ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయాయి. దీనిపై టీడీపీ ఏపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు స్పందించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో వైసీపీకి ఉత్తరాంధ్ర ప్రజలు బుద్ధి చెప్పారని ఎద్దేవా చేశారు. మూడు రాజధానుల పేరుతో వైసీపీ ప్రభుత్వం చెప్పిన మాటలను ఇక్కడి ప్రజలు నమ్మలేదని అచ్చెన్నాయుడు అన్నారు. తమకు కావాల్సింది రాజధాని కాదని, అభివృద్ధి అని ప్రజలు తేల్చిచెప్పారని ఆయన పేర్కొన్నారు.

ఎమ్మెల్సీ ఫలితాలు చూస్తుంటే..  జగన్‌కు కర్రు కాల్చి వాత పెట్టిన విధంగా వున్నాయన్నారు. ఉత్తరాంధ్రలోని 34 నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, మంత్రులు ఇంటింటికి తిరిగి మూడు రాజధానుల గురించి ప్రచారం చేశారని.. కానీ ప్రజలు మాత్రం తమకు అభివృద్ధే కావాలని తేల్చిచెప్పారని అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి మూడు చోట్ల టీడీపీ విజయం సాధించిందని.. మూడో స్థానంలోనూ తమనే విజయం వరిస్తుందని అచ్చెన్నాయుడు ధీమా వ్యక్తం చేశారు. 

Also Read: తూర్పు రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ వైసిపిదే... చంద్రశేఖర్ రెడ్డి విజయం

కాగా.. ఏపీలోని మూడు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. ఉత్తరాంధ్ర, తూర్పు రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానాల్లో టీడీపీ భారీ ఆధిక్యంలో వుండగా.. పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ స్థానంలో మాత్రం వైసీపీ, టీడీపీ మధ్య హోరాహోరీ పోటీ నెలకొంది. తూర్పు రాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానంలోనూ తెలుగుదేశం పార్టీ ముందంజలో వుంది. ఆరు రౌండ్ల తర్వాత కూడా ఆ పార్టీ అభ్యర్ధి కంచర్ల శ్రీకాంత్ 23,068 ఓట్ల ఆధిక్యంలో వున్నారు. 

click me!