నేను కమ్యూనిస్టును, చంద్రబాబు అంటే ఇష్టం: అశ్వినీదత్

By pratap reddyFirst Published Sep 25, 2018, 7:49 AM IST
Highlights

అశ్వినీద‌త్ నిర్మించిన చిత్రం దేవ‌దాస్‌ ఈ నెల 27న విడుద‌ల‌ అవుతోంది. వైజ‌యంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిర్మాత సి.అశ్వ‌ినీద‌త్ మీడియాతో మాట్లాడారు. 

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై సినీ నిర్మాత అశ్వినీదత్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. అశ్వినీద‌త్ నిర్మించిన చిత్రం దేవ‌దాస్‌ ఈ నెల 27న విడుద‌ల‌ అవుతోంది. వైజ‌యంతీ మూవీస్ నిర్మాణ సంస్థ 45 వ‌సంతాల‌ను పూర్తి చేసుకున్న సంద‌ర్భంగా నిర్మాత సి.అశ్వ‌ినీద‌త్ మీడియాతో మాట్లాడారు. 

ఈ కార్యక్రమంలో తన సినిమాల మాత్రమే కాకుండా రాజకీయాలపై కూడా ఆయన మాట్లాడారు. తెలుగుదేశం పార్టీపై తనకు ఎందుకు ఇష్టమనే విషయాన్ని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ ప్ర‌చారానికి సంబంధించిన ప‌నులు చేయ‌డానికి తాను సిద్ధంగా ఉన్నట్లు తెలిపారు. ప్రచారం చేస్తాను గానీ తాను ఎన్నికల్లో పోటీ చేయబోనని, ప్రచార విభాగంలో మాత్రం త‌ప్ప‌కుండా తన వంతు పాత్ర నిర్వహిస్తానని ఆయన చెప్పారు. 

దేవదాస్ సినిమా విడుద‌ల తర్వాత తాను పబ్లిసిటీ పనిలో మునిగిపోతానని చెప్పారు. ఎన్టీఆర్ పార్టీ పెట్ట‌డానికి వ‌చ్చిన‌ప్పుడు ప్ర‌జ‌ల‌కు మంచి చేస్తారు, గొప్ప‌గా చేస్తారని అనుకున్నాను త‌ప్ప‌ తాను ఆయ‌న వెనుక వెళ్లలేదని అశ్వినీదత్ చెప్పారు. ఆ త‌ర్వాత తాను హైద‌రాబాద్ వ‌చ్చి స్థిరపడిన త‌ర్వాత ఇక్క‌డ చంద్ర‌బాబునాయుడు చేస్తున్న ప‌నులు చూసి, కేవ‌లం ఆయ‌న మీద ఆకర్షణతో ముందుకు వచ్చానని వివరించారు. 

తన న‌ర‌న‌రాల్లోనూ క‌మ్యూనిస్ట్ పార్టీ ఉంటుందని, తన తండ్రి పెద్ద క‌మ్యూనిస్ట్ అని, అలాంటిది తనకు చంద్రబాబుపై ఇష్టమని, అందుకే తెలుగుదేశం పార్టీకోసం ప్రచారం చేస్తున్నానని చెప్పారు. మీ సీనియారిటీకి ఎన్నికల్లో పోటీ చేస్తే బాగుంటుంద‌ని చాలా మంది అన్నారని, తనకు పోటీ చేయాల‌ని లేదని చెప్పారు. 

నామినేటెడ్‌గా, గౌర‌వ‌ప్ర‌ద‌మైన ప‌ద‌వులు కావాల‌ని కూడా అనుకోవ‌డం లేదని అశ్వినీదత్ అన్నారు. తాను ఎవరి మీదా తన అభిప్రాయాలను రుద్దబోనని చెప్పారు.

click me!