విజయనగరంలో చారిత్రక కట్టడం, జాతీయ చిహ్నం కూల్చివేత... మాజీకేంద్ర మంత్రి సీరియస్

By Arun Kumar PFirst Published May 23, 2020, 8:44 PM IST
Highlights

విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేసిన ఘటనపై ఆ రాజవంశీకులు, మాజీ కేంద్ర మంత్రి అశోక గజపతి రాజు సీరియస్ అయ్యారు. 

విజయనగరం: వందల ఏళ్లక్రితం విజయనగరం లో  నిర్మించిన మూడు లాంతర్లు కట్టడం  విజయనగరం కి చారిత్రక చిహ్నం అని... అలాంటి కట్టడాన్ని కాపాడాల్సిన ప్రభుత్వమే కూల్చివేత బాధాకరమని మాజీ కేంద్రమంత్రి, విజయనగర రాజవంశీయులు పూసపాటి అశోకగజపతి రాజు అన్నారు. ఈనాడు రాజ్యాంగ బద్దంగా ప్రమాణం చేసి పదవులు అనుభవిస్తున్న నాయకులే చారిత్రక చిహ్నాల ద్వంసానికి పాల్పడటం దారుణమని అశోకగజపతిరాజు మండిపడ్డారు. 

''ఆనాటి విజయనగరం వైభవానికి కొన్ని ఆనవాళ్లు మిగిలివున్నాయి. అందులో గంటస్తంభం, ముడులాంతర్లు, మ్యూజిక్ కళాశాల వంటివి కొన్ని మచ్చు తునకలు. ముడులాంతర్ల వద్ద స్వతంత్ర సమరయోధులు నిర్మించిన మూడు సింహాల చిహ్నం కూడా వుంది.  వీటన్నింటికి ఈ ప్రభుత్వం, అధికారులు గౌరవం ఇవ్వడం లేదు'' అని ఆగ్రహం వ్యక్తం చేశారు. 

''ముడులాంతర్ల జంక్షన్ వద్ద హరికథ పితామహుడు అధిబట్ల నారాయణ దాసు హరికదలు చెప్పిన సందర్భాలు ఉన్నాయి. ఎంతో మంది మహానుభావులు ఈ ముడులాంతర్ల కింద కూర్చుని చదువుకున్న సందర్భాలు ఉన్నాయి. మన పూర్వికులు గత చరిత్రలను ఈ తరానికి ఎన్నో అనుభవాలను, గుర్తింపులను ఇచ్చింది వాటిని కాపాడుకోలేక పోతున్నందుకు బాధగా ఉంది'' అని ఆవేదన వ్యక్తం చేశారు. 

''ప్రజలు వెంటనే స్పందించి మన చరిత్రకు, చరిత్ర అనవాళ్లకు జరుగుతున్న నష్టాన్ని అడ్డుకోవాలి. మేము ప్రజాస్వామ్య బద్దంగా పోరాడతాం. ఇది మనందరి భవిష్యత్తు.. దీన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ప్రజలు శాంతియుత పద్ధతుల్లో నిరసన తెలియచేయాలి'' అని అశోకగజపతి రాజు సూచించారు. 

విజయనగరం పట్టణంలో రాజుల కాలం నాటి చారిత్రక కట్టడం మూడు లాంతర్ల స్తంభాన్ని మున్సిపల్ యంత్రాంగం కూల్చివేసిన విషయం తెలిసిందే.  మూడు ప్రధాన రహదారుల కలిసే చోట నిర్మించిన హరికేన్ లాంతర్ల స్తంభంతో పాటు పక్కనే వున్న జాతీయ చిహ్నం మూడు సింహాల నిర్మాణాన్ని కూడా  అధికారులు కూల్చివేశారు.  

రాత్రి సమయంలో ప్రయాణికులకు దారి కనిపించేందుకు రాజుల కాలంలో మూడు లాంతర్ల స్తంభం నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. మూడు లాంతర్ల స్తంభం   కారణంగా ఆ ప్రాంతాన్ని మూడు లాంతర్ల జంక్షన్ గా పిలుస్తారు. రాజుల కాలం నాటి కట్టడాన్ని కూల్చివేయడం పై  పట్టణ ప్రజలు, ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 
 

click me!