
చంద్రబాబునాయుడు మాటలకు, చేతలకు ఏమాత్రం పొంతనుండదు. తాజాగా ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్య్వూనే అందుకు నిదర్శనం. ఇంటర్వ్యూలో చాలా అంశాలు మట్లాడారుకానీ ప్రధాన అంశాలు మాత్రం చూద్దాం. మీడియాతో మాట్లుడుతూ, ప్రజల ఓటు తమకు కాక ఇంకెవరికి పడతాయంటూ ధీమా వ్యక్తం చేసారు.
సరే నూటికి 85 శాతం ప్రజలు తన పాలన పట్ల సంతృప్తిగా ఉన్నారంటూ గతంలో చాలాసార్లే చెప్పుకున్న విషయమూ అందరికీ తెలిసిందే. ప్రజల ఓట్లు తమకు మాత్రమే పడతాయని అంత ధీమా ఉంటే మరి ఫిరాయింపు ఎంఎల్ఏలతో ఎందుకు రాజీనామా చేయించటం లేదు. వారితో రాజీనామాలు చేయించి ఉప ఎన్నికలను ఎదుర్కోవచ్చు కదా? పోనీ పెండింగ్ లో ఉన్న మున్సిపల్ ఎన్నికలను ఎందుకు నిర్వహించటం లేదో చెబుతారా?
తాను పూర్తి ప్రజాస్వామ్యవాదిగా చెప్పుకున్నారు. మరి అంతటి ప్రజాస్వామ్యవాదే అయితే, వైసీపీ ఎంఎల్ఏలను ఎందుకు లాక్కున్నట్లు? రాష్ట్రంలో ప్రతిపక్షమన్నదే ఉండకూడదని ఎన్నిసార్లు బహిరంగంగా అనలేదు? తనపైన, లోకేష్, ప్రభుత్వంపై సోషల్ మీడియాలో వస్తున్న కార్టూన్లను సహించలేక అరెస్టులు ఎందుకు చేయిస్తున్నారు? ఇక, తన కుటుంబం ఎప్పటికీ తప్పుచేయదంటూ గొప్పలు చెప్పుకోవటం విచిత్రంగా ఉంది. అందరికీ తెలిసిన ‘ఓటుకునోటు’ కేసు మాటేమిటి? ఎప్పటి నుండో స్టేల మీద కొనసాగుతున్న 18 కేసుల మాటేమిటి?
పార్టీలో చిన్న చిన్న అభిప్రాయభేదాలు సహజమేనట. ఫిరాయింపు ఎంఎల్ఏల నియోజకవర్గాల్లో రెండువర్గాలు రోడ్డున పడి కొట్టేసుకోవటం, హత్యలు జరుగుతుండటం చిన్న చిన్న భేదాభిప్రాయాలా? పార్టీలకు అతీతంగా సంక్షేమ పథకాలు అమలవుతున్నాయా? జన్మభూమి కమిటీలు పెట్టి మొత్తం పథకాలను పచ్చచొక్కాల వారికి మాత్రమే వర్తింపచేస్తున్నది నిజం కాదా? ప్రతిపక్షాలతో పాటు మిత్రపక్షం కూడా ఆరోపణలు చేస్తోంది కదా?
ఒకపుడు తుఫాను వస్తోందని హెచ్చరికలు చేస్తుంటే ఎవరు నమ్మేవారు కాదట. ఇపుడు మరో 45 నిముషాల్లో పిడుగు పడుతున్న విషయాన్ని కూడా చెప్పగలుతుగున్నామన్నారు. పిడుగుపాటుకు చంద్రబాబుకు ఏం సంబంధం? తుఫాను హెచ్చరికలైనా, పిడుగుపడే విషయాన్ని చెప్పగలుగుతున్నాఇస్రో శాస్త్రవేత్తల కృషి ఫలితమే. ఇందులో చంద్రబాబుకు ఏం సంబంధమూ లేదు. కాకపోతే ప్రచారం మాత్రం ఆయన చేసుకుంటున్నారు. ఇక, పవన్ కల్యాణ్ గురించి మాట్లాడారు కానీ ఎవరికీ అర్ధంకానీ సహజశైలిలో మాట్లాడారు.