జెసిపై మండిపడుతున్న అశోక్

First Published Jun 16, 2017, 4:11 PM IST
Highlights

సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించటం, ప్రింటర్ను విసిరేయటంతో పాటు అప్పటి సమయం కూడా మొత్తం ఫుటేజిలో స్పష్టంగా కనబడుతోంది. దాంతో తనను తప్పుదోవ పట్టించారంటూ జెసిపై అశోక్ మండిపడుతున్నారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు అశోక్ వివరించారట.

విశాఖపట్నం విమానాశ్రయంలో జరిగిన జెసి వీరంగంపై విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజు మండిపడుతున్నారు. ఎయిర్ పోర్టు వివాదంలో జెసి తనను తప్పుదోవ పట్టించారని బాగా ఆగ్రహంగా ఉన్నారట. ఇద్దరూ టిడిపి ఎంపిలే అయినప్పటికీ ఇద్దరి మనస్తత్వంలో చాలా తేడాలున్నాయి. అశోకేమో ఎవ్వరి గొడవను పట్టించుకునే రకం కాదు. జెసి ఏమో అందుకూ పూర్తిగా విరుద్ధం.

తాజా వివాదంలో ఇపుడు జరిగిందదే. విమానాశ్రయానికి సమయానికి రావాల్సిన జెసి గంట ఆలస్యంగా వచ్చారు. విశాఖపట్నం నుండి విమానాశ్రయం ఉదయం 8.10కి బయలుదేరుతుంది. దానికి గంట ముందు ప్రయాణీకులు విమానాశ్రయానికి చేరుకుని బోర్డింగ్ పాస్ తీసుకోవాలి. అటువంటిది జెసి 7.40 కి చేరుకున్నారు. అంటే బోర్డింగ్ పాస్ తీసుకోవాల్సిన సమయానికన్నా సుమారు 30 నిముషాలు ఆలస్యంగా వచ్చారు.

వచ్చిందే ఆలస్యం. దానికితోడు సిబ్బందిపై వీరంగం. దాంతో వివాదం కాస్త జాతీయస్ధాయికి చేరుకున్నది. వివాదం జరిగిన వెంటనే జెసి కేంద్రమంత్రితో మాట్లాడారట. తాను సమయానికే విమానాశ్రయానికి చేరుకున్నా బోర్డింగ్ పాస్ ఇచ్చే సిబ్బందే ముందే కౌంటర్ మూసేసారంటూ ఫిర్యాదు కూడా చేసారు. దానికితోడు తాను వీరంగం చేసినట్లు తప్పుడు ప్రచారం కూడా జరుగుతోందన్నారట. జెసి చెప్పిన మాటలను కేంద్రమంత్రి నిజమనుకున్నారు. ఎప్పుడైతే వివాదం పెద్దదైపోయింది వెంటనే కేంద్రమంత్రి సిసి ఫుటేజిలను పరిశీలించమని ఆదేశించారు.

ఫుటేజీలను చూసిన అధికారులు కేంద్రమంత్రికి కూడా చూపారట. వాటిని చూసిన కేంద్రమంత్రి నివ్వెరపోయారట. జెసి చెప్పినదానికి విరుద్దంగా ఉండటంతో ఏం చేయాలో అశోక్ కు దిక్కు తోచలేదట. సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించటం, ప్రింటర్ను విసిరేయటంతో పాటు అప్పటి సమయం కూడా మొత్తం ఫుటేజిలో స్పష్టంగా కనబడుతోంది. దాంతో తనను తప్పుదోవ పట్టించారంటూ జెసిపై అశోక్ మండిపడుతున్నారు. అదే విషయాన్ని చంద్రబాబునాయుడుకు అశోక్ వివరించారట.

click me!