
రాజుగారికి కొత్త తలనొప్పి వచ్చి పడింది. విశాఖపట్నం విమానాశ్రయంలో అనంతపురం ఎంపి జెసి దివాకర్ రెడ్డి చేసిన వీరంగం ఇపుడు టిడిపి ఎంపి, విమానయానశాఖ మంత్రి అశోక్ గజపతిరాజుకు చుట్టుకుంది. ఇటు ఎంపి, అటు మంత్రి ఇద్దరూ టిడిపి వారే కావటంతో వ్యవహారంలోకి చంద్రబాబునాయుడు కూడా దిగాల్సి వచ్చింది. ఇండిగో విమాన సిబ్బందిపై తానేమీ దురుసుగా వ్యవహరించలేదని మొదటి రెడ్డిగారు బుకాయించారు. అయితే, సిసి ఫుటేజి బయటపడటంతో తేలుకుట్టిన దొంగ పరిస్ధితి అయిపోయింది రెడ్డిగారిది.
సిసిఫుటేజి పుణ్యమా అని చంద్రబాబు కూడా ఎంపిని సమర్ధించలేని పరిస్ధితి. దాంతో ఏం చేయాలో దిక్కు తెలీకుండా మరో రాజ్యసభ సభ్యుడు సిఎం రమేష్ కు వ్యవహారాన్ని పురమాయించారు. విషయం చిన్నదే అయినా పెద్దది కావటానికి కారణం జాతీయ మీడియానే. ఘటన వెలుగు చూసిన తర్వాత నేషనల్ మీడియా ఇటు రాజుగారిని అటు రెడ్డి గారిని ఇద్దరినీ పట్టుకుని వుతికేసింది.
ఎందుకంటే, ఇటీవలే శివసేన ఎంపి గైక్వాడ్ విమాన సిబ్బంది పట్ల దురుసుగా వ్యవహరించారంటూ అశోక్ ఓ రేంజిలో రెచ్చిపోయారు. మరి, అటువంటి వ్యవహారంలోనే సొంత పార్టీ ఎంపి చిక్కుకునేటప్పటికి రాజు గారు ఏం మాట్లాడక పోగా రక్షించేందుకు ప్రయత్నిస్తున్నట్లు ప్రచారం మొదలైంది. దాంతో నేషనల్ మీడియా రెచ్చిపోయింది. దాంతో మొత్తం వ్యవహారం నుండి రాజుగారు దూరంగా జరగక తప్పలేదు. అందుకే తాను ఎవరినీ రక్షించేందుకు ప్రయత్నాలు చేయటం లేదంటూ మొత్తుకుంటున్నారు. ఇంతలో రెడ్డిగారిని విమానాల్లోకి ఎక్కనిచ్చేది లేదంటూ మొత్తం ఏడు విమానాల యాజమాన్యాలు నిర్ణయం తీసుకున్నాయి. చివరకు వివాదం ఏ మలుపు తిరుగుతుందో చూడాలి.