సంగం డెయిరీ కేసులో అరెస్టయిన టీడీపీ నేత దూళిపాళ్ల నరేందరుకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఆయనను చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించనున్నారు.
అమరావతి: సంగం డెయిరీ అక్రమాల కేసులో టీడీపీ నేత ధూళిపాళ్ల అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ప్రస్తుతం ఆయన రాజమండ్రి జైల్లో రిమాండ్‌లో ఉన్నారు. తాజాగా ధూళిపాళ్ల నరేంద్రకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. జ్వరం, జలుబు లక్షణాలతో ఆయన ఇబ్బందులు పడుతున్నారు.
నరేంద్ర ఆరోగ్య పరిస్థితులపై కుటుంబ సభ్యులు, ఆయన తరపు లాయర్ హైకోర్టులో పిటిషన్ వేశారు. ఈ పిటిషన్‌ను స్వీకరించిన ధర్మాసనం ధూళిపాళ్లకు ప్రైవేట్ ఆసుపత్రిలో టెస్టులు చేయించి, చికిత్స అందించాలని పోలీసులు, జైలు అధికారులను హైకోర్టు ఆదేశించింది.
దీంతో నరేంద్రను రాజమండ్రి జైలు నుంచి ప్రైవేటు ఆస్పత్రికి తరలించనున్నారు. ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సంగం డెయిరీ ఎండీ గోపాలకృష్ణకు కోవిడ్ పాజిటివ్ వచ్చింది. ప్రస్తుతం ఆయన కూడా ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
ఇదిలావుంటే, ఏపీలో కరోనా ఉగ్రరూపం కొనసాగుతోంది. వరుసగా రెండో రోజూ 20 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. గడిచిన 24గంటల వ్యవధిలో 1,16,367 శాంపిల్స్ పరీక్షించగా.. రాష్ట్ర వ్యాప్తంగా 22,204 మందికి పాజిటివ్‌గా నిర్ధారణ అయినట్టు ఆరోగ్యశాఖ వెల్లడించింది. అలాగే, 85 మంది మృతి చెందారు.
విశాఖ, విజయనగరంలో 11మంది మృతి
గడిచిన 24గంటల్లో తూర్పుగోదావరి జిల్లాలో అత్యధికంగా 2,344మంది కరోనా బారిన పడ్డారు. అత్యల్పంగా కడప జిల్లాలో 903 కేసులు నమోదయ్యాయి. ఇక మరణాలను పరిశీలిస్తే విశాఖపట్నం, విజయనగరంలలో 11మంది చొప్పున ప్రాణాలు కోల్పోగా అనంతపురంలో 10, తూర్పుగోదావరి 9, ప్రకాశం 8, పశ్చిమగోదావరి 7, చిత్తూరు 6, గుంటూరు 5, కర్నూలు 5, నెల్లూరు 5, కృష్ణా 4, శ్రీకాకుళం 3, కడపలో ఒకరు మృతి చెందారు.
రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటివరకు 1,69,50,299 శాంపిల్స్ పరీక్షించగా 12,06,232మందికి పాజిటివ్‌గా తేలింది. వీరిలో 10,27,270మంది కోలుకొని డిశ్చార్జి కాగా.. 8374మంది ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్రంలో ప్రస్తుతం 1,70,588 క్రియాశీల కేసులు ఉన్నాయి.